ఘరానా మోసం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:03 AM
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. విశ్రాంత అధ్యాపకురాలికి ఫోన్ చేసి తాము పోలీసులమని, మీరు పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. భయాందోళనకు గురైన ఆమె తన బ్యాంకు ఖాతానుంచి రూ.40,11 000 నగదును నిందితులు సూచించిన ఖాతాకు బదిలీ చేసింది.
ఘరానా మోసం
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ బెదిరింపులు
నగదును వేరే ఖాతాకు బదిలీ చెయ్యాలని ఆదేశం
ఉచ్చు పన్నిన సైబర్ నేరగాళ్లు
రూ.40లక్షలు బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసిన బాధితురాలు
విజయనగరం క్రైం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. విశ్రాంత అధ్యాపకురాలికి ఫోన్ చేసి తాము పోలీసులమని, మీరు పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించారు. భయాందోళనకు గురైన ఆమె తన బ్యాంకు ఖాతానుంచి రూ.40,11 000 నగదును నిందితులు సూచించిన ఖాతాకు బదిలీ చేసింది. ఆ వెంటనే నిందితులు మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చెయ్యడంతో ఆమె మోసపో యినట్లు గుర్తించింది. ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఎస్పీ వకుల్‌జిందాల్ సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు తెలిపారు.
నగరంలోని కొత్తఆగ్రహారం ప్రాంతానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు ఉసిరకళ సుజాతకుమారికి అక్టోబరు 10వ తేదీన ఉదయం 10.30 గ ంటల సమయంలో గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ చేసి తాము పోలీసులమని, మీరు పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నట్లు కనుగొన్నామని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. డీసీపీ స్థాయి అధికారి కేసు విచారిస్తున్నారని, బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదును తాము సూచించిన బ్యాంక్ అకౌంట్‌కు పంపాలని హుకుం జారీ చేశారు. బ్యాంక్ లావాదేవీలపై విచారణ పూర్తి చేసిన తరువాత తిరిగి మీ అకౌంట్‌కి డబ్బులు పంపుతామని చెప్పడంతో ఆమె భయపడి నమ్మేశారు. నిందితులు సూచించిన బ్యాంక్ అకౌంట్‌కు నగదు బదిలీ చేశారు. పోలీసుల సూచనతో సైబర్ పోర్టల్‌లో సకాలంలో ఫిర్యాదు చెయ్యడంతో నిందితుల ఖాతాల్లో రూ.20 లక్షలు ఫ్రీజ్ అయ్యాయి. ఆ వెంటనే ఎస్పీ ఆదేశాలతో సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది నిందితుల ఖాతాకు జమైన నగదు వివరాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించారు.
- జమ్ముకాశ్మీర్‌కు చెందిన ముమిన్ తారీఖ్ బట్ ఎ-1 గా అరెస్ట్ చేసి విచారణ చెయ్యగా బ్యాంక్‌ఖాతాను సైబర్ నేరాగాళ్లకు అద్దెకు ఇచ్చానని, అకౌంట్లో పడిన నగదు 5 నిమిషాల వ్యవధిలో వేరే ఖాతాకు బదిలీ చేస్తూంటానని, అందుకు, 3 శాతం కమీషన్ ఇస్తారని తెలిపాడు. ఎ-1 ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్రకు వెళ్లి ముఠాను గుర్తించారు.
- ఈ ముఠా టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. ముంబయి పూనెకు చెందిన నలుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.10 లక్షల నగదు, రూ.9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 6 సెల్‌ఫోన్లు సీజ్‌చేశామని ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని ఆరెస్ట్ చేసేందుకు నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. కేసును సమర్థవంతంగా చేధించిన సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ ప్రసన్నకుమార్, పీసీలు, రవి, శంకర్, ఎస్.రవి, కె.సన్యాశినాయుడు, వై.రామరాజులను ఎస్పీ అభినందించారు.