సాగునీటికి కటకట
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:40 PM
వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చివరి దశకు చేరుకున్న వరి పంటను కాపాడు కునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
పంటను రక్షించుకునేందుకు రైతుల పాట్లు
భామిని, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చివరి దశకు చేరుకున్న వరి పంటను కాపాడు కునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో భామిని మండలం వడ్డంగి గ్రామంలో గజపతిసాగరం, ఊర, కనపలకర్ర చెరువులు పూర్తిగా అడుగంటాయి. అయితే వాటి పరిధిలో 300 ఎకరాల్లో వరి పంటకు ఒకటి రెండు తడులు అవసరం. లేకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడులు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు చెరువు గర్భంలో గోతులు తవ్వి ఊటనీటిని ఇంజన్ సాయంతో పొలాలకు మళ్లిస్తున్నారు. కాగా కొన్నిచోట్ల ఆశించిన విధంగా ఊటనీరు రావడం లేదు. రెండు, మూడు రోజుల తర్వాత గోతుల్లో ఊరుతున్న నీటిని పైపుల ద్వారా పొలాలకు మళ్లించి పంటలకు తడి అందిస్తున్నారు. మండలంలోని లోహరజోల, నులకజోడు, బురుజోల, బొడ్డగూడ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.