Kandikottala Festival ఘనంగా కందికొత్తల పండుగ
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:41 PM
Grand Celebration of Kandikottala Festival గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్‌లో ఆదివారం కందికొత్తల పండుగను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు.
హాజరైన ప్రభుత్వ విప్, కలెక్టర్
గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్‌లో ఆదివారం కందికొత్తల పండుగను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. తొలుత కలెక్టర్ పండగ వేడుకలను ప్రారంభించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. హెచ్ గ్రౌండ్ సమీపంలోని కొండపై ఉన్న దుర్గమ్మ గుడిని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి గిరిజన యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డీఎం మహేంద్ర, తహసీల్దార్ శివన్నారాయణ, టీడీపీ కన్వీనర్ పాడి సుధ, గిరిజన నాయకులు కృష్ణబాబు, భారతి, కళావతి, సింహాచలం, సర్పంచ్‌లు గౌరీశంకరరావు, చైతన్య స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
రూ.257 కోట్లతో రహదారుల నిర్మాణం
జిల్లాలోని కొండశిఖర గ్రామాల్లో సుమారు రూ.257 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ మేరకు భారీగా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో కిశోర బాలికలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఏనుగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పార్వతీపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే టెన్త్ విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. కొద్ది నెలల్లో పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాత్రివేళల్లో వారు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులు గమనిం చాలన్నారు. అవసరం మేరకు విద్యార్థుల ఇళ్లను అప్పుడప్పుడు సందర్శించాలన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది కూడా టెన్త్ ఉత్తీర్ణత శాతంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలపాలన్నారు. విద్యార్థుల అటెండెన్స్ 95 శాతానికి తగ్గకుండా ఉండాలన్నారు. టెన్త్ తర్వాత ఎం చదవాలి, ఎలా సిద్ధం కావాలి వంటి అంశాలను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో ఎన్.తిరుపతి నాయుడు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.