Share News

బడ్డు‘కొండ’ంత హామీలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM

గడిచిన ఐదేళ్లుగా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించిన బడ్డుకొండ అప్పలనాయుడు ఇచ్చిన హామీలు కలగానే మిగిలిపోయాయి. ఆయన చెప్పిన మాటలు నేటికీ నియోజక వర్గ ప్రజల చెవుల్లో గింగిర్లు కొడుతూనే ఉన్నాయి.

బడ్డు‘కొండ’ంత హామీలు
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన కొండ ప్రాంతం

- టేబుళ్ల మీదే ప్రతిపాదిత ఫైళ్లు

- మళ్లీ ఎన్నికలకు సిద్ధంపై సర్వత్రా విమర్శలు

(నెల్లిమర్ల)

గడిచిన ఐదేళ్లుగా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించిన బడ్డుకొండ అప్పలనాయుడు ఇచ్చిన హామీలు కలగానే మిగిలిపోయాయి. ఆయన చెప్పిన మాటలు నేటికీ నియోజక వర్గ ప్రజల చెవుల్లో గింగిర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయన ప్రతిపాదించిన ఫైళ్లు టేబుళ్లపై నుంచి కదలలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. కొత్తగా హామీలు ఇవ్వడం మొద లుపెట్టారు. ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు కొత్త పందాలపై కసరత్తు చేస్తున్నారు.

తారకరామ పూర్తయ్యేదెప్పుడో..

నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామం వద్ద నిర్మాణ దశలో ఉన్న తారకరామ రిజర్వాయర్‌ తన హయాంలో పూర్తిచేసి సాగునీరు అందిస్తానని ఇచ్చిన మాట అలాగే ఉండిపోయింది. నిర్మాణం ఇప్పటికీ కొన... సాగుతూనే ఉంది. సాగునీటి కోసం డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం 2007లో ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉంది. ముంపు బాధితుల సమస్యలు తీర్చలేదు. వారికి నష్టపరిహారం చెల్లింపు కూడా పూర్తి చేయలేదు. నిర్వాసిత గ్రామాల నిర్మాణానికి ఇంత వరకు స్థల సేకరణే జరగలేదు. ముంపు బాధితులు తమ పొలాలను కోల్పోయి ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీటితోపాటు విజయనగరం, నెల్లిమర్ల తదితర ప్రధాన పట్టణాలకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని చెప్పి.. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్యెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నేటికీ వాటిని పరిష్కరించలేకపోవడం విశేషం. ఆ సమస్యలు అలాగే ఉన్నా... మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త హామీలు గుప్పిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ స్థలం అన్నారు..

నెల్లిమర్ల నగర పంచాయతీలోని సుమారు 1400 మంది పేదలకు అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీ ఇస్తామని అప్పట్లో ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రకటించారు. పట్టాలు కూడా పంపిణీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం కొండ ప్రాంతం కావడంతో లబ్ధిదారులు ఆ స్థలాన్ని వద్దని తిరష్కరించారు. అప్పటి నుంచి గత మూడేళ్లుగా ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని చెప్పడమే తప్ప... కొత్తగా ఎక్కడా స్థలాన్ని చూపించలేదు. లబ్ధిదారులు చేతుల్లో ఇప్పటికీ పట్టాలు మాత్రమే ఉన్నాయి. స్థలం మాత్రం పొందలేకపోయారు.

మరికొన్ని ప్రతిపాదనల వరకే..

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 2023 మే 3న విమానాశ్రయం శంకుస్థాపనకు భోగాపురం వచ్చినపుడు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అభ్యర్థన మేరకు పలు అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నట్లు సభా వేదిక పైనుంచే ప్రకటించారు. ఇంత వరకు ఆ పనులు కాగితాలను దాటలేదు. నెల్లిమర్ల మండలంలోని గరికిపేట నుంచి తుమ్మలపేట వరకు, కొండవెలగాడ నుంచి రోళ్లవాక వరకు తారు రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతవరకు ఆ పనులు ప్రారంభం కాలేదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గ్రామం మధ్య నుంచి వెళ్తున్న నెల్లిమర్ల-శ్రీకాకుళం రాష్ట్ర రహదారికి బదులుగా రామతీర్థం బోడి కొండను ఆనుకుని బైపాస్‌ నిర్మాణం చేస్తామని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రతిపాదనను ఎమ్మెల్యే బడ్డుకొండ తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేయిస్తానని చెప్పారు. ఇంత వరకు అమలు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేగా బడ్డుకొండ ఎన్నో హామీలు ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా మళ్లీ ఎన్నికలకు సిద్ధమంటుండడంపై నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:58 PM