హైస్కూల్ ప్లస్.. సౌకర్యాలు నిల్
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:17 PM
గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన హైస్కూల్ ప్లస్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. పేరుకే ఇవి కళాశాలలుగా కొనసాగుతున్నాయి. గతంలో జడ్పీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలిచ్చిన వైసీపీ సర్కారు వాటికి సరిపడా అధ్యాపకులను నియమించ లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేక చేతులేత్తేసింది.
రెగ్యులర్ అధ్యాపకులు లేక ఇబ్బందులు
చదువుల్లో వెనుకబడుతున్న విద్యార్థులు
వెంటాడుతున్న మౌలిక సౌకర్యాల కొరత
ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి
వాటి స్థానంలో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు
సీతంపేట రూరల్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన హైస్కూల్ ప్లస్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. పేరుకే ఇవి కళాశాలలుగా కొనసాగుతున్నాయి. గతంలో జడ్పీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలిచ్చిన వైసీపీ సర్కారు వాటికి సరిపడా అధ్యాపకులను నియమించ లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేక చేతులేత్తేసింది. దీంతో చాలా హైస్కూల్ ప్లస్ కళాశాలల్లో అడ్మిషన్‌లు కూడా రాని పరిస్థితి నెలకొంది. కొన్నింట విద్యార్థులు చేరినప్పటికీ చదువులు ముందుకు సాగక సగంలో మానేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చేరే ఆర్థికస్థోమత లేక తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు విద్యార్థులు ఈ హైస్కూల్ ప్లస్ కళాశాలల్లో చేరి అరకొర చదువులు కొనసాగిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో గురుగుబిల్లి జడ్పీ హైస్కూల్, సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిల్లో హైస్కూల్ ప్లస్ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో సీతంపేట హైస్కూల్ ప్లస్ కళాశాల ప్రారంభంలో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూప్‌లకు అడ్మిషన్లు ప్రారంభించారు. అయితే సీఈసీ గ్రూప్‌లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. బైపీసీ, ఎంపీసీ గ్రూప్‌ల్లో 80 సీట్లకు అడ్మిషన్లు ఇస్తే 68 మంది విద్యార్థులు చేరారు. రెగ్యులర్ అధ్యాపకులు లేక.. పోవడంతో సిలబస్ ముందుకు సాగక.. 10 మంది విద్యార్థులు టీసీలు తీసుకొని ఇతర కళాశాలలకు వెళ్లిపోయారు. మిగిలిన 58 మంది మాత్రమే బైపీసీ, ఎంపీసీ గ్రూప్‌ల్లో చదువు కొనసాగిస్తున్నారు.
సీనియర్ ఉపాధ్యాయులే అధ్యాపకులుగా..
రాష్ట్రంలో ఒక్క సీతంపేట ఉన్నత పాఠశాలను మాత్రమే హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మిగిలిన జడ్పీ హైస్కూల్స్‌ని ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వాస్తవంగా ఈ హైస్కూల్ ప్లస్ కళాశాలకు ఏడుగురు రెగ్యులర్ అధ్యాపకులను నియమించాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోదించే ఉపాధ్యాయులకు, కళాశాలల్లో బోధించే అధ్యాపకులకు విద్యార్హతలో చాలా తేడాలు ఉంటాయి. హైయర్ క్వాలీఫైడ్ ఉపాధ్యాయులు ఉన్పప్పటికీ ఇంటర్మీడియట్ సిలబస్‌ను బోధించడం అంత తేలికైన పని కాదు. అందులోనూ సైన్స్ గ్రూప్ చదువుతున్న విద్యార్థులకు బోధించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ సీతంపేట హైస్కూల్ ప్లస్ ఉపాధ్యాయులు శక్తికి మించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఒకవైపు 6 నుంచి పది తరగతుల వారికి, మరో వైపు ఇంటర్మీడియట్ రెండు గ్రూప్‌ల విద్యార్థులకు రోజూ క్లాసులు చెప్పాల్సి వస్తోంది. అర్హత కలిగిన సీనియర్ ఉపాధ్యాయులే హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు బోధించాలని గతంలో ఆదేశాలు వచ్చాయని హెచ్‌ఎం శ్యాంసుందర్ తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులే అధ్యాపకులుగా మారి విద్యార్థులకు బోధిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మౌలిక సౌకర్యాల కొరత
సీతంపేట హైస్కూల్ ప్లస్ కళాశాలకు మౌలిక సౌకర్యాల కొరత వెంటాడుతోంది. ఒకే భవనంలో కింద హౌస్కూల్, పై అంతస్థులో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పైగా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ వారికి థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ల్యాబ్ లేదు. పాఠశాల సైన్స్ ల్యాబ్‌లోనే ఏర్పాట్లు చేశారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో ఇంటర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రద్దు చేయనున్న కూటమి ప్రభుత్వం
గత వైసీసీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన హైస్కూల్ ప్లస్‌లకు కూటమి ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. వాటి స్థానంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనుంది. దీనిలో భాగంగా అర్హులైన లెక్చరర్లను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే మండలానికి ఓ జూనియర్ కళాశాల ఏర్పాటు కానుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
డిప్యూటీ డీఈవో ఏమన్నారంటే...
‘ సీతంపేట హైస్కూల్ ప్లస్‌కు రెగ్యులర్ అధ్యాపకుల కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాలు వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.’ అని పాలకొండ డిప్యూటి డీఈవో పి.కృష్ణమూర్తి తెలిపారు.