అన్నదాతకు ఎంత కష్టం!
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:32 AM
వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రైతన్నలు పంట నష్టాలను ఎదుర్కొన్నారు. ఎకరాకు సుమారు రూ.40వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు నీట మునిగిన పంటలను చూసి కన్నీరు పెడుతున్నారు. కొందరు పంట కోసి కుప్పలుగా వేయగా ఇంకొందరు పొలాల్లోనే పనలుగా ఉంచారు. ఆరిన తరువాత కుప్పలు పెడదామనుకొనేలోపు వాయుగుండం వచ్చి ముంచింది.
అన్నదాతకు ఎంత కష్టం!
తడిసిన వరి పనలు
అపరాలకూ ముప్పు
విజయనగరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి):
వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రైతన్నలు పంట నష్టాలను ఎదుర్కొన్నారు. ఎకరాకు సుమారు రూ.40వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు నీట మునిగిన పంటలను చూసి కన్నీరు పెడుతున్నారు. కొందరు పంట కోసి కుప్పలుగా వేయగా ఇంకొందరు పొలాల్లోనే పనలుగా ఉంచారు. ఆరిన తరువాత కుప్పలు పెడదామనుకొనేలోపు వాయుగుండం వచ్చి ముంచింది. కొన్ని ప్రాంతాల్లో వరి కుప్పలు కూడా నీటిలో ఉన్నాయి. దీంతో మొలకలొచ్చే ప్రమాదం పొంచి ఉంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 30 మీమీ వర్షపాతం నమోదైంది. కాగా వరి తరువాత లాభసాటి వ్యవసాయంగా అపరాల పంటలనే జిల్లా రైతులు సాగు చేస్తుంటారు. ఈ వర్షాలకు ఆ పంటలు కూడా కలిసి రావడం లేదు. పెసర, మినప పంటలు పూర్తిగా నీటిలో ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినా పొలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. వరి కోతలు పూర్తయిన చోట అపరాలు వేశారు. ఆ పొలాలన్నీ నీట మునిగి ఉండడంతో పంటలు పోయేలా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వరి కోతల తరువాత దుక్కి దున్ని అపరాల విత్తనాలు చల్లడం అలవాటు. మరోవైపు వేరుశనగ, నువ్వు పంటలను సైతం సాగుచేస్తుంటారు. వీటన్నింటి పైనా రైతులు ఆశలు వదులుకుంటున్నారు. పూసపాటిరేగ మండలంలో టమాటా పంటకు నష్టం కలిగింది. పేరాపురం, వెంపడాం, చౌడవాడ, పూసపాటిరేగ, గోవిందపురం గ్రామాల్లో ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. 20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. కాగా జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. వర్షాలకు గెడ్డలు, ఇతర ప్రాంతాల నుంచి భారీగా వర్షం నీరు వచ్చి జలశయాల్లో చేరింది.
పంట నష్టాన్ని నమోదు చేశాం
వ్యవసాయ శాఖ జేడీ రామారావు
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఈనెల 18 నుంచి 21 వరకూ నాలుగు రోజుల్లో 109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, పంట నష్టం వివరాలను నమోదు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ రామారావు తెలిపారు. రబీ పంటలకు సంబంధించి 5801 హెక్టార్లలో మొక్కజొన్న, 4081 హెక్టార్లలో పెసర, 10,067 హెక్టార్లలో మినుము పంట సాగులో ఉందని చెప్పారు. వరి, మొక్కజొన్న, పెసర, మినుమ తదితర పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు తేదీని నెలాఖరు వరకూ పొడిగించామని చెప్పారు. వరి పంటకు రూ.630, మొక్కజొన్న రూ.540, మినుము,పెసర పంటలకు రూ.300 వంతున ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందవచ్చని చెప్పారు.