భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:31 AM
బొబ్బి లి రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలోని తెర్లాం మండలం డి.గదబవలస జంక్షన్‌లో గంజాయి తరలిస్తున్న రెండు కార్లను పట్టుకున్నామని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు.
బొబ్బిలి/ తెర్లాం, డిసెం బరు 19 (ఆంధ్రజ్యోతి): బొబ్బి లి రూరల్ పోలీసు సర్కిల్ పరిధిలోని తెర్లాం మండలం డి.గదబవలస జంక్షన్‌లో గంజాయి తరలిస్తున్న రెండు కార్లను పట్టుకున్నామని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా నుంచి అక్రమంగా రెండు వాహనాల్లో గంజాయి వస్తున్నట్టు అందిన సమాచారంతో రూరల్ సీఐ నారాయణరావు, రామభద్రపురం, బాడంగి ఎస్‌ఐలు ప్రసాద్, తారకేశ్వరరావు, పీసీలు విష్ణు, పృధ్వీ తదితరులతో నిఘా పెట్టారు. రామభద్రపురం నుంచి రాజాం హైవేలో తనిఖీలు చేపట్టగా తెర్లాం డి.గదబవలస జంక్షన్‌లో గంజాయి తరస్తున్న రెండు కార్లను గుర్తించారు. మొదట ఆ కార్లలో ఎటువంటి గంజాయి లభ్యం కాలేదు. ఆ తర్వాత క్షుణ్ణంగా సోదా చేసి, కార్ల బానెట్‌లో గంజాయిని గుర్తించారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా పొందేల్ గ్రామానికి చెందిన చందన్ అడ్‌కటియా, హర్యానా రాష్ట్రం పాలవాల్ జిల్లా గోధి గ్రామానికి చెందిన వీరేంద్ర సింగ్, అదే రాష్ట్రం పరిదాబాద్‌కు చెందిన సునీల్ రాణాలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని రిమాండ్ తరలించారు. వీరితో పాటు ఒక మైనర్ కూడా ఉన్నాడు. అలాగే ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా ఘటిగూడ గ్రామానికి చెందిన కృష్ణపాంగి, సునీల్ అడ్‌కటియాతో పాటు హర్యానాకు చెందిన బన్వారీ అనే ముగ్గురు పరారయ్యారు. నిందితుల నుంచి 15 ప్యాకెట్లు (18.2 కిలోల గంజాయి), రెండు కార్లు, రూ.12 వేలు నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు విష్ణు, పృధ్వీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
పి.కోనవలసలో...
పాచిపెంట, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద బుధవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల నుంచి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటసురేష్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బుధవారం సాయంత్రం స్థానిక చెక్‌పోస్టు సమీపంలో నలుగురు వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వీరిని స్థానిక పోలీసులు విచారించారు. బ్యాగులు తనిఖీ చేయగా సుమారు 8 కిలోల గంజాయి లభించింది. ఆ నలుగురు వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రం కొరాపుట్ నుంచి చెన్నైకు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బొడ్డవర చెక్‌పోస్టు వద్ద..
శృంగవరపుకోట రూరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద గురువారం మధ్యాహ్నం గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విశాఖకు వెళుతున బోలెరో వాహనాన్ని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. స్మగ్లర్లు తెలివిగా బయటకు గంజాయి కనిపించకుండా వాహనంలో ఒక ప్రత్యేక అర ఏర్పాటుచేసి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వాహనాన్ని పట్టుకున్నారు. అందులో సుమారు వంద కేజీలు గంజాయి ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ నారాయణమూర్తి వివరణ కోరగా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల్సి ఉందన్నారు. శుక్రవారం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
గంజాయి రవాణాదారుడి అరెస్టు ..
విజయనగరం క్రైం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై తనిఖీలు చేపట్టగా... అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న హరియాణా రాష్ట్రానికి చెందిన కుషన్ షీబ్ అనే వ్యక్తి పట్టుబడినట్టు జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు. రాయగడ నుంచి తిరుపతికి గంజాయి రవాణా చేస్తున్నట్టు తేలిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్టు తెలిపారు.