Urgent... That's It అత్యవసరమైతే .. అంతే!
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:24 AM
If It's Urgent... That's It జిల్లాలో రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉంది. ఏటా దాదాపు 9 వేల యూనిట్లు అవసరమై ఉండగా 3 వేల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అత్యవసర వేళల్లో రోగులు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నా.. ముందుకు రాని దాతలు
అరుదైన బ్లడ్ గ్రూపులకూ తప్పని ఇబ్బందులు
ఇంకా ప్రారంభం కాని మూడు రక్త నిల్వ కేంద్రాలు
పొరుగు జిల్లాలకు రోగుల పరుగు
జియ్యమ్మవలస, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉంది. ఏటా దాదాపు 9 వేల యూనిట్లు అవసరమై ఉండగా 3 వేల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అత్యవసర వేళల్లో రోగులు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. రక్తహీనత కేసులు, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, గర్భిణులు, బాలింతలు, వివిధ ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఏటా రక్త అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ స్థాయిలో నిల్వలు లేకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నెలకు ఆయా కేసులకు 200 నుంచి 300 యూనిట్ల వరకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో బ్లడ్ నిల్వలు లేకపోవడం వల్ల ఒక్కోసారి రోగుల బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించి రక్తం అందిస్తున్నారు. మరోవైపు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నా.. ఆశించిన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావడం లేదు. కొన్ని బ్లడ్ గ్రూపుల రక్తం కూడా లభించకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సి ఉంది. రక్తదానంపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లా విభజన కాక ముందు 2007లో పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ప్రారంభమైంది. కొన్నాళ్ల తరువాత ప్రభుత్వ రక్తనిధి కేంద్రంగా మారింది. జిల్లా ఆవిర్భావం తర్వాత సాలూరు, పాలకొండ, సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రులుగా మారాయి. రక్తదాన శిబిరాల్లో దాతల నుంచి సేకరించిన రక్తంలో కొంత జిల్లా కేంద్ర ఆసుపత్రిలో భద్రపరిచి, మిగిలిన కొంత ప్రాంతీయ ఆసుపత్రుల్లో బ్లడ్ స్టోరీజీ యూనిట్లకు పంపిస్తున్నారు. కానీ రక్తదాతలు పెద్దగా ముందుకు రాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాకు వచ్చిన కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ముందు చూపుతో పీహెచ్‌సీ స్థాయిల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అయితే జిల్లా అవసరాలకు తగ్గట్టుగా రక్త నిల్వలు లేకపోవడం కలవరపరుస్తోంది. ప్రధానంగా ఏ, బీ, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపులు, ఏబీ నెగిటివ్, ఏబీ పాజిటివ్ గ్రూపుల రక్తం అంతగా లభ్యం కావడం లేదు. ఇలాంటి వారిని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. వేసవిలో అయితే రిఫరల్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అత్యవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, ఇతరుల నుంచి దాతలకు సమాచారం ఇచ్చి రక్తం సేకరిస్తున్నారు. అయితే ఇందుకు కొంత సమయం వరకు నిరీక్షించాల్సి వస్తోంది.
అవసరం ఇలా...
పార్వతీపురంలో జిల్లా కేంద్రాసుపత్రి, ప్రాంతీయ (ఏరియా) ఆసుపత్రులు మూడు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు మూడుతో పాటు 37 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఏటా దాదాపు 300 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 500 మంది నుంచి 700 మంది వరకు క్షతగాత్రులు ఆసుపత్రులకు చేరుతుండగా.. వీరిలో 200 మంది వరకు రక్తం అవసరం అవుతోంది.
- ప్రాంతీయ ఆసుపత్రులు సాలూరు, సీతంపేట, పాలకొండలో రోజుకు నాలుగైదు యూనిట్లు, చినమేరంగి, భద్రగిరి, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు యూనిట్లు వరకు అవసరం.
- అంతేకాకుండా సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా (రక్తహీనత)తో బాధ పడే రోగులకు నెలకు దాదాపు 700 యూనిట్లు రక్తం అవసరమవుతోంది.
- ఏటా దాదాపు 15 వేల ప్రసవాలు జరుగుతుండగా, వీరిలో 5 వేల మంది వరకు రక్తం అవసరం.
- అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలు, గాయాలతో వెళ్తున్న వారిలో చాలామందికి రక్తం కావాలి. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రక్తనిధి, సరఫరా కేంద్రాల నుంచి రక్తం అందించాల్సి ఉంది.
- ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలంటే బొబ్బిలి ప్రైవేట్ రక్తనిధి కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. వారు కొంత డబ్బులు తీసుకోవడంతో పాటు డోనర్ నుంచి బ్లడ్ తీసుకొని అవసరమైన రక్తం ఇస్తున్నారు.
నిల్వలు ఇలా..
పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో రక్తనిధి కేంద్రం ఉండగా.. పాలకొండ, సాలూరు, కురుపాంలో బ్లడ్ స్టోరేజీ యూనిట్లు ఉన్నాయి. అయితే సీతంపేట, భద్రగిరి, చినమేరంగి సీహెచ్‌సీలకు స్టోరేజీ యూనిట్లు మంజూరైనా...టెక్నీషియన్లు లేని కారణంగా ఆయా చోట్ల అవి ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆ సీహెచ్‌సీలకు జిల్లా కేంద్రాసుపత్రి నుంచే రక్త నిల్వలను తీసుకురావల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు అత్యవసర సమయాల్లో జిల్లా కేంద్రాసుపత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది.
దాతలు ముందుకు రావాలి
జిల్లా వ్యాప్తంగా రోజుకు 50 యూనిట్ల వరకు రక్తం అవసరం అవుతోంది. రక్తదాన శిబిరాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావడం లేదు. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వారి కుటుంబ సభ్యులు, రోగుల నుంచి రక్తం సేకరించాల్సి వస్తోంది. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రక్తదాతలు ముందుకు రావల్సి ఉంది.
- వాగ్దేవి, డీసీహెచ్‌ఎస్, పార్వతీపురం మన్యం
================================
పాలకొండలో ఏర్పాటుకు అనుమతి
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు అనుమతి, లైసెన్స్ వచ్చింది. త్వరలో బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంతకుముందు రోగులు బ్లడ్ కోసం పార్వతీపురం లేదా శ్రీకాకుళం పరుగులు పెట్టేవారు. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు.
- జి.నాగభూషణరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, పాలకొండ