Share News

నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం!

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:17 PM

గిరిజన ఆశ్రమ పాఠశాలలపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. వాటి నిర్వహణను గాలికొదిలేసిన గత ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు మంగళం పాడేసింది. నిధుల కేటాయింపును మరిచింది. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించింది.

 నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం!
కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల

గత వైసీపీ సర్కారు అలసత్వం.. విద్యార్థులకు శాపం

ఆశ్రమ పాఠశాలల నిర్వహణను పట్టించుకోని వైనం

ఏఎన్‌ఎంలను తొలగించి.. మౌలిక వసతులకు మంగళం

అనారోగ్య సమస్యలతో బాలబాలికల మృత్యువాత

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

జియ్యమ్మవలస, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలలపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. వాటి నిర్వహణను గాలికొదిలేసిన గత ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు మంగళం పాడేసింది. నిధుల కేటాయింపును మరిచింది. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన ఏఎన్‌ఎంలను తొలగించింది. మరోవైపు సురక్షిత నీరు, సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వంటి తదితర కారణాలతో ఐదేళ్ల కాలంలో ఎంతోమంది గిరిజన విద్యార్థులు మృత్యువాత పడ్డారు. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల నిర్వాకంతో ఈ ఏడాదిలోనూ పలువురు విద్యార్థులు మరణించడంతో సర్వత్రా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏఎన్‌ఎంలను నియమిస్తామని ఇటీవల మంత్రి సంధ్యారాణి కూడా ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను త్వరగా ఆశ్రమ పాఠశాలలకు బదలాయించాలని గిరిజన సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 15 మండలాల్లో 420 గిరిజన పాఠశాలలు ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్‌ 350 (1, 2 తరగతులు), ఆశ్రమ పాఠశాలలు 47, గురుకులాలు 4, గురుకులం జూనియర్‌ కళాశాలలు 4, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు 8, ఏకలవ్య మోడ్రన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు (ఈఎంఆర్‌ఎస్‌) 4, స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (ఎస్‌వోఈ) ఒకటి, మినీ గురుకులం ఒకటి, గిరిజన సంక్షేమ గర్ల్స్‌ ఆర్‌జేసీలు ఒకటి ఉన్నాయి. వాటిల్లో 14,186 మంది బాలురు, 11,571 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అయితే 2019 వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మినహా మిగిలిన అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించే వారు. దీంతో విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో క్షేమంగా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీన్‌ మారింది. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను తొలగించారు. దీంతో గిరిజన విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.

మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు అంతే...

గత టీడీపీ ప్రభుత్వం 2016-17లో ఆశ్రమ పాఠశాలల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించింది. విద్యార్థులకు సురక్షిత నీటిని అందించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇవన్నీ మూలనపడి పోయాయి. కనీసం వాటి నిర్వహణకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో గిరిజన విద్యార్థులు సురక్షిత నీటికి దూరమయ్యారు.

విద్యార్థుల మరణాలు ఇలా..

- 2023, అక్టోబరు 5న నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలురు)లో కొండగొర్రి రాహుల్‌ జ్వరంతో మృతి చెందాడు.

- 2023, ఫిబ్రవరి 30న కొమరాడ మండలం ఉలిపిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన కోలక సుమిత్ర రక్తహీనత సమస్యతో.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

- 2023, ఆగస్టు 27న గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో హిమరిక ప్రమీల అపస్మారక స్థితికి చేరుకోగా.. ఈ బాలికకు విశాఖ కేజీహెచ్‌లో బ్రెయిన్‌ సర్జరీ చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

- 2023, డిసెంబరు 14న గుమ్మలక్ష్మీపురం మండలం కే డీ కాలనీ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్ధి ఫిట్స్‌తో తాడికొండ పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

- 2024 ఫిబ్రవరి 2న పాచిపెంట మండలం టీడబ్ల్యూఏహెచ్‌ బాలికల స్కూల్‌లో నిమ్మక శ్వేత అనే విద్యార్థిని చిన్నప్పటి నుంచి లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. డ్రాపౌట్‌ విద్యార్థి అయిన బాలికకు విశాఖ కేజీహెచ్‌ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

- 2024, ఫిబ్రవరి 17న పార్వతీపురం మండలం యర్రసామంతవలస టీడబ్ల్యూఏహెచ్‌ బాలుర పాఠశాల విద్యార్థి హార్ట్‌ ఫెయిల్యూర్‌ కారణంగా పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

- 2024, ఫిబ్రవరి 20న సరాయివలస టీడబ్ల్యూఏహెచ్‌ బాలికల స్కూల్‌ విద్యార్థిని పుంగరి అనిత లంగ్‌ ఇన్ఫెక్షన్‌తో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

- 2024, ఫిబ్రవరి 21న గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి టీడబ్ల్యూఏహెచ్‌ బాలికల పాఠశాలకు చెందిన బిడ్డిక శృతి హార్ట్‌, కిడ్నీ ఫెయిల్‌ కావడంతో మృతి చెందింది.

- 2024, ఫిబ్రవరి 24న గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి టీడబ్ల్యూఏహెచ్‌ బాలుర పాఠశాలకు చెందిన తాడంగి వంశీ అనే విద్యార్థి విపరీతమైన తల నొప్పితో మృతి చెందాడు.

- 2024, మార్చి 7న కొమరాడ మండలం కెమిశీల టీడబ్ల్యూఏహెచ్‌ బాలుర పాఠశాల విద్యార్థి కిల్లక శరత్‌ ర్యాబిస్‌తో మృతి చెందాడు.

- 2024, మార్చి 8న కొమరాడ మండలం యండభద్ర టీడబ్ల్యూఏహెచ్‌ బాలుర పాఠశాల విద్యార్థి కె.రవి సికిల్‌ సెల్‌ ఎనీమియాతో బాధపడుతూ.. మృతి చెందాడు.

- ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు కురుపాం నియోజకవర్గంలో నలుగురు, సాలూరు నియోజకవర్గంలో ఒకరు చనిపోయినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి

ఆశ్రమ పాఠశాలల్లో ప్రతి 20 మంది విద్యార్థులను చూసుకునే బాధ్యతను ఒక టీచర్‌కు అప్పగించాం. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకెళ్తే వారి నుంచి డిక్లరేషన్‌ తీసుకుంటాం. విద్యార్థి ఆరోగ్యం బాగోలేకపోతే ఇంటికి పంపించబోం.

- కె.చంద్రబాబు, ఏటీడబ్ల్యూవో, కురుపాం

Updated Date - Nov 17 , 2024 | 11:17 PM