Share News

మెనూ అమలు ఇలాగేనా?

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:19 AM

సీతంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. చాలీ చాలని కూరలు పెడుతూ.. చేతులు దులుపుకుంటున్నారు. దీంతో విద్యార్థినులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. అర్ధాకలితోనే వారు విద్యనభ్యసించాల్సి వస్తోంది.

 మెనూ అమలు ఇలాగేనా?
సీతంపేట కేజీబీవీ

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

కేజీబీవీలో విద్యార్థినులకు తప్పని ఇబ్బందులు

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 15: సీతంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. చాలీ చాలని కూరలు పెడుతూ.. చేతులు దులుపుకుంటున్నారు. దీంతో విద్యార్థినులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. అర్ధాకలితోనే వారు విద్యనభ్యసించాల్సి వస్తోంది. వాస్తవంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కేజీబీవీలో చదువుతున్న బాలికలకు ప్రత్యేకంగా భోజన సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే మెనూ అమలులో పాఠశాల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సీతంపేట కేజీబీవీలో 5వ తరగతి నుంచిఇంటర్‌ వరకు మొత్తంగా 272 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వారికి ప్రతి ఆదివారం ప్రత్యేక మెనూతో భోజనం పెట్టాల్సి ఉంది. బగారన్నంతో పాటు ఒక్కొక్కరికీ 100 గ్రాములు చికెన్‌, టమాటా రసం, చిక్కని మజ్జిగ ఇవ్వాలి. శాఖాహారులంటే బగారన్నం, గొంగూర కూర లేకుంటే చట్నీ, బంగాళాదుంప కూర్మా పెట్టాలి. కాని ఇక్కడ మాత్రం అవేవీ అమలు కావడం లేదు. చాలీచాలని కూరలతో భోజనం పెట్టి మమ అని పిస్తున్నారు. రాగా ఈ ఆదివారం కేజీబీవీలో విద్యార్థినులకు కేవలం రెండు అంటే రెండు చికెన్‌ ముక్కలు వేశారు. చిక్కని మజ్జిగను పూర్తిగా విస్మరించారు. శాఖాహారులైన పిల్లలకు బంగాళాదుంప కూర మాత్రమే పెట్టారు. అసలు కేజీబీవీ విద్యార్థినుల కోసం సుమారు 20 కేజీల చికెన్‌ వండాలి. కానీ పది కేజీల చికెన్‌, 5 కేజీల బంగాళ దుంపలు కలిపి వండుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై కేజీబివి ప్రిన్సిపాల్‌ రూపను వివరణ కోరగా.. కేజీబీవీలో విద్యార్థినులకు మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. ‘ఈ ఒక్కసారికి ఇలా జరిగింది... మెనూ అమలులో మరోసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం’ అని అకౌంటెంట్‌, వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత చెప్పడం గమనార్హం.

Updated Date - Sep 16 , 2024 | 12:19 AM