nellimarla incident: ఆ ఘటనకు నాలుగేళ్లు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:22 PM
nellimarla incident: వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలతో పాటు దేవుళ్లకూ రక్షణ కరువైంది. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని పలుచోట్ల దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయాలు, రథాలు ధ్వంసమయ్యాయి.
- నిందితులను పట్టుకోవడంలో వైసీపీ సర్కారు నిర్లక్ష్యం
- అదిగో ఇదిగోనంటూ కాలయాపన చేసిన పాలకులు
- ఆందోళన చేసిన అప్పటి విపక్ష నేతలపై కేసులు
విజయనగరం డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలతో పాటు దేవుళ్లకూ రక్షణ కరువైంది. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని పలుచోట్ల దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయాలు, రథాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి శనివారం నాటికి నాలుగేళ్లు అవుతుంది. కానీ, నిందితులు ఇప్పటికీ పట్టుబడలేదు. నిందితులను గుర్తించడంలో జగన్ సర్కారు విఫలమైంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. ఆర్భాటపు హడావుడితో గడిపేసింది.
అసలు ఏం జరిగిందంటే..
పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానం పరిధిలోని బోడికొండపై ఉన్న కోదండరామ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని 2020 డిసెంబరు 28న దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించి రాముని విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. మరుసటి రోజు ఉదయం దేవస్థానం అర్చకుడు ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు కొండపైకి వెళ్లిచూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మూడు రోజుల తరువాత బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముని విగ్రహ శిరస్సు లభ్యమైంది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అప్పటి విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు ఆలయాన్ని సందర్శించారు. రాజకీయ పార్టీలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి మరీ పోరాడాయి. వివిధ పీఠాధిపతులు సందర్శించి ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ధార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కేసును సీబీ సీఐడీకి అప్పగించింది. ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. దర్యాప్తు అధికారులు పలుమార్లు కొండపైకి వచ్చి విచారణ చేపట్టారు. ఆగంతకులు సుత్తి,సేనం, ఎలక్ర్టానిక్ రంపంతో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గుర్తించినట్టు తెలిసింది. అప్పట్లో ఏకకాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇటువంటి రంపంతోనే రాష్ట్రంలో మిగతాచోట్ల సైతం ధ్వంసాలకు పాల్పడినట్టు తేల్చారు. ఆ ఒక్క మాట తప్పించి దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. అటు తరువాత ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు లీకులిచ్చారు. కానీ రాజకీయ కోణంలోనే వారిని అరెస్టు చేసినట్టు అప్పట్లో విపక్షాలు మండిపడ్డాయి. అసలు చేసినదెవరు? చేయించినదెవరు? అన్నది లోతుగా దర్యాప్తు జరగలేదు.
ఐక్య పోరాటం
విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి ముందుగా స్పందించింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి దిగువస్థాయి నేతల వరకూ అంతా ఐక్య పోరాటానికి సిద్ధమయ్యారు. ఆలయం వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఈ ఘటనను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని భక్తులు ఆశించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సరిగ్గా స్పందించలేదు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. బీజేపీ రాష్ట్ర నాయకులు పోరాటాన్ని కొనసాగించి ఉంటే ఒత్తిడి పెరిగేదని..అప్పుడు కేసులో కొంతవరకూ పురోగతి వచ్చి ఉండేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి.
ఏడాది తరువాత ప్రారంభం
విగ్రహాల ధ్వంసం తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలను రప్పించి ప్రతిష్ఠించారు. వాస్తవానికి ఏడాదిలోపు కోదండరామస్వామి ఆలయాలన్ని పునర్నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకుగాను రూ.3 కోట్లు కేటాయించినట్టు చెప్పింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఏడాదిలో ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాలు ప్రతిష్టిస్తే చాలా మంచిదని చిన్నజీయర్‌స్వామి చెప్పారు. కానీ, ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఘటన జరిగి ఏడాదికి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కేవలం భూమి పూజకే చాలారోజులు పట్టింది. ఆలయ నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగాయి.
అశోక్‌పై పెత్తనానికి..
రామతీర్థం దేవస్థానం మాటున మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజుపై పెత్తనం సాగించేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహారాలను నడిపింది. ఇందుకు దేవదాయశాఖ అధికారులను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వ పెద్దల్లో ఒకరు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తతంగం నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆశోక్ గజపతిరాజును తప్పించి సంచయితకు మాన్సాస్ పీఠాన్ని కట్టబెట్టి భంగపడిన సదరు నేత ఎలాగైనా దెబ్బకొట్టాలన్న వ్యూహంతో అధికారులను పావుగా వాడుకొని ఉసిగొలిపారు. రామతీర్థం దేవస్థానం వేదికగా అప్పుడు అశోక్‌గజపతిరాజును అవమానించారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో అశోక్‌ను అడ్డుకొని చాలా తప్పుచేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అంతర్గత సమయావేశాల్లో తప్పుపట్టారు. జిల్లాలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం రామతీర్థం దేవస్థానం ఘటనేనని ఇప్పటికీ వైసీపీ శ్రేణులు భావిస్తుంటారు. కూటమి ప్రభుత్వమైనా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని జిల్లా ప్రజలతో పాటు భక్తులు కోరుతున్నారు.