రైతన్నకు కష్టం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:01 AM
వరి పంటకు తొలుత రెల్లిరాల్చు పురుగు సోకడంతో వెన్ను విరిగి కొంత నష్టం వాటిల్లింది. మిగిలిన పంటనైనా దక్కించుకుందామని అనుకున్న సమయంలో తుఫాన్ విరుచుకుపడింది.
రైతన్నకు కష్టం
నీటిలో వరికంకులు
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): వరి పంటకు తొలుత రెల్లిరాల్చు పురుగు సోకడంతో వెన్ను విరిగి కొంత నష్టం వాటిల్లింది. మిగిలిన పంటనైనా దక్కించుకుందామని అనుకున్న సమయంలో తుఫాన్ విరుచుకుపడింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నీటిపాలైంది. జిల్లాలో 93,300 హెక్టార్లలో వరి సాగు చేశారు. 60,900 హెక్టార్లలో కోతలు పూర్తి చేశారు. 439 హెక్టార్లలో కోసినప్పటికీ వరిపనులు పొలంలో ఉన్నాయి. వీటికే ఎక్కువ నష్టం వాటిల్లే అపాయం పొంచి ఉంది. ఇప్పటికే వరి చేను నుంచి మొలకలు వస్తున్నాయి.
పంట వివరాలు నివేదించండి: కలెక్టర్
వర్షాలకు దెబ్బతిన్న వరి పంట వివరాలను రెండు మూడు రోజుల్లో నివేదించాలని కలెక్టరు అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులు నుంచి వినతులు స్వీకరించాక జిల్లా అధికారులతో సమీక్షించారు. కోతలు కోసి పొలాల్లో పనలుగా ఉన్న పంట ఎంత ఉంది? నూర్చిన ధాన్యం ఏమైనా ఉన్నాయా? తదితర వివరాలను గ్రామ, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు పొలాలకు వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై 116 వినతులు వచ్చాయి.
------------