Share News

ఇది మంచి ప్రభుత్వం

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:55 PM

వైసీపీ పాలనలో గతి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతోంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇది మంచి ప్రభుత్వం
శరవేగంగా జరుగుతున్న భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు

- కూటమి పాలనకు వంద రోజులు

- ఎన్నో హామీలు అమలు

- ప్రజల్లో ఆనందం

విజయనగరం (ఆంధ్రజ్యోతి) సెప్టెంబరు 20: వైసీపీ పాలనలో గతి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతోంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేశారు. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్నక్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దు, మెగా డీఎస్సీ, ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి హామీలను నెరవేర్చి శభాష్‌ అనిపించుకుంది. త్వరలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలు కానుంది. మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అమలు చేసిన హామీలు ఇవే..

- వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా తీయలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహణకు పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు డీఎస్సీ దస్త్రంపై సంతకం చేయడంతో విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. జిల్లాకు సంబంధించి 543 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీచేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

- చంద్రబాబు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల్లో ప్రధానమైనది సామాజిక పింఛన్ల పెంపు. వైసీపీ ప్రభుత్వం ఏటా రూ.250 చొప్పున పెంచి 2024 నాటికి లబ్ధిదారులకు రూ.3వేలు పింఛన్‌ అందించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి రూ.వెయ్యి పెంచి దాన్ని రూ.4 వేలు చేసింది. అదే విధంగా విభిన్నప్రతిభావంతులకు ఇచ్చే పింఛన్‌ను రూ.6వేలుకు పెంచింది. దీంతో జిల్లాలోని పింఛన్‌దారులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.


- గత టీడీపీ ప్రభుత్వ పాలనలో రూ.5కే పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో పేదలు, కార్మికులు ఇబ్బందులు పడ్డారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి సర్కారు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తోంది. గత నెల 16న విజయనగరం రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. బొబ్బిలిలో కూడా తాజాగా ప్రారంభించారు.

- విజయనగరం జిల్లా దశ, దిశను మార్చే భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వంలో శరవేగంగా జరుగుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పనులకు శంకుస్థాపన కూడా చేశారు. భూ సేకరణ కూడా పూర్తయ్యింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది. 2023లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేసి వదిలేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎయిర్‌పోర్టు పనులు ఊపందుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి పనులపై సమీక్షించారు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వందరోజుల్లో మూడు పర్యాయాలు ఈ పనులు పరిశీలించారు. గడువు ప్రకారం 2026 డిసెంబరు నాటికి విమానాశ్రయం పూర్తవ్వాల్సి ఉంది. కానీ ఆరు నెలల ముందుగానే జూన్‌ 26 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.


- జగన్‌ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పాడైన పాత బస్సులనే వినియోగించి, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దశలవారీగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేస్తోంది. వంద రోజుల్లో విజయనగరం ఆర్టీసీ డిపోకి 3 ఆలా్ట్ర డీలక్స్‌ బస్సులు, రెండు సాధారణ బస్సులు, ఎస్‌.కోటకు కూడా రెండు సాధారణ బస్సులు మంజూరు చేసింది. రానున్న రెండు, మూడు నెలల్లో విజయనగరం డిపోకి మరో ఆరు బస్సులు, ఎస్‌కోట డిపోకి నాలుగు బస్సులు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

- గత ఐదేళ్లలో జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, నగరపాలక సంస్థ రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయని పరిస్థితి. ఈ రహదారులను బాగు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించడంతో కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే, గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బకాయి పడిన రూ.6కోట్లను విడుదల చేసింది. ఇరిగేషన్‌ పనులకు రూ.10 లక్షలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులకు రూ.22 కోట్లు, ప్రతి గ్రామంలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కోసం రూ.15 నుంచి రూ.30 లక్షల విడుదల చేసింది. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 3వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.

- ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూటమి ప్రభుత్వ ఉచితంగా అందించింది.

-ప్రజలకు ఇసుకను ఉచితంగా అందజేస్తుంది. ఇసుక బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది.

- భూ బకాసరులకు అండగా ఉండేందుకు జగన్‌ సర్కారు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం.

- ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే, తల్లికి వందనం, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం తదితర పఽథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది.

- ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లి వచ్చిన చంద్రబాబునాయుడు ఆర్‌ఈసీఎస్‌ పునరుద్ధరణ, పరిశ్రమల ఏర్పాటు, ఫెర్రో పరిశ్రమలను తెరిపిం చడంపై హామీ ఇచ్చారు. ఈ హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

Updated Date - Sep 20 , 2024 | 11:55 PM