జై శ్రీరామ్
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:41 AM
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి స్వీయపర్యవేక్షణలో శుక్రవారం రాత్రి బొబ్బిలి రాజాకళాశాల మైదానంలో శ్రీరామ పాదుకారాఽధన కన్నుల పండువగా జరిగింది. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జై శ్రీరామ్
కన్నుల పండువగా శ్రీరామ పాదుకారాధన
బొబ్బిలి వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం
బొబ్బిలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి స్వీయపర్యవేక్షణలో శుక్రవారం రాత్రి బొబ్బిలి రాజాకళాశాల మైదానంలో శ్రీరామ పాదుకారాఽధన కన్నుల పండువగా జరిగింది. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బొబ్బిలి వికాసతరంగణి, ఎమ్మెల్యే బేబీనాయన సంయుక్తంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. చినజీయర్‌స్వామి స్వయంగా వేదమంత్రోచ్ఛారణతో భక్తులతో పాదుకారాధన చేయించారు. భక్తులంతా పరవశించిపోయారు. తొలుత చినజీయర్‌స్వామి స్థానిక శ్రీవేణుగోపాలస్వామిని దర్శించుకొని అక్కడి స్వామివారికి బంగారు ఆభరణాల అలంకరణను పునఃప్రారంభించారు. అక్కడ నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా రాజా కళాశాల మైదానానికి తరలివచ్చారు. మహిళల కోలాటం, తప్పిటగుళ్లు, జానపద నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
రక్షించాలని వేడుకుందాం: చినజీయర్‌స్వామి
వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పుల ప్రభావంతో జనజీవనం అతలాకుతల మవుతోందని, ఆ విపత్తుల నుంచి రక్షించాలని భగవంతుడిని వేడుకుందామని చినజీయర్‌స్వామి అన్నారు. ‘వాతావరణం చల్లబడాలి. పంటలు సమృదిఽ్ధగా పండాలి. మానవ సంబంధాలు మెరుగుపడాలి. శ్రీరాముని పాదుకలే మనకు శ్రీరామరక్ష. భరతుడు 14 ఏళ్లు శ్రీరామపాదుకలను ఆరాధించుకొని పాలన సాగించడంతో దేశ సంపద పదింతలు వృద్ధి అయింది’ అంటూ భక్తులను ఉద్దేశించి రామాయణంలోని వివిధ ఘట్టాలను ఉటంకించారు. భక్తులంతా సంపదలతో తులతూగాలని, పేదలందరికీ సహాయ పడాలని, భక్తులు కాని వారు సన్మార్గంలో పయనించాలని స్వామీజీ కోరారు. లోక కళ్యాణార్థం ఎమ్మెల్యే బేబీనాయన, వికాసతతరంగణి వారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆశీర్వదించారు. ఈ నెల 11 న గీతాజయంతి సందర్భంగా అందరూ భగవద్గీతను ఆలపించాలని హితవు పలికారు. బేబీనాయన మాట్లాడుతూ చినజీయర్‌స్వామి పవిత్రమైన మంగళశాసనాలతో బొబ్బిలి ప్రాంత ప్రజలకు అమూల్యమైన ఆధ్యాత్మిక వరాన్ని ప్రసాదించారన్నారు. ఆయన దివ్యచరణాలతో వేణుగోపాల స్వామికి ఆభరణాలను బ్యాంకు లాకరు నుంచి తెప్పించి పునః అలంకరణ చేసుకోవడం చాలా సంతోషదాయకమన్నారు.
బొబ్బిలి కోటలో తీర్థగోష్టి
బొబ్బిలి కోట దర్బారు మహల్ ఆవరణలో శుక్రవారం ఉదయం తీర్థగోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో త్రిదండి చినజీయర్‌స్వామి మాట్లాడుతూ బొబ్బిలి పట్టణ ప్రజల ఇలవేల్పు వేణుగోపాలస్వామికి అమూల్యమైన బంగారు, వజ్రవైఢూర్యాలతో పొదిన ఆభరణాల అలంకరణను సుమారు 70 ఏళ్లక్రితం నుంచి నిలుపుదల చేశార న్నారు. రాజవంశీయులైన బేబీనాయన సోదరులు శ్రీవేణుగోపాలస్వామికి పూర్వవైభవం తీసుకురావాలన్న తపనతో బ్యాంకులో ఉన్న ఆభరణాలను రప్పించి అలంకరిస్తున్నార న్నారు. బొబ్బిలి రాజులకు భగవత్ నిష్ట ఎక్కువని, వైష్ణవసాంప్రదాయాలను విశేషంగా గౌరవిస్తున్నారని, ఆ భగవంతుని దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై కొనసాగుతాయన్నారు. డబ్బు, బంగారం, పదవులు ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని, భగవంతుని సేవలో తరించడం ఒక్కటే జీవితానందానికి పరమావధి అని చెప్పారు.