Share News

భక్తి శ్రద్ధలతో ఆకాశజ్యోతి ప్రజ్వలన

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:36 AM

రాజీపేట గ్రామంలో ఉన్న శంబలనగరి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆకాశజ్యోతి వెలిగించారు.

 భక్తి శ్రద్ధలతో ఆకాశజ్యోతి ప్రజ్వలన
కాగడాను సిద్ధం చేస్తున్న ఎంపీ శ్రీభరత్‌

శృంగవరపుకోట రూరల్‌/ జామి, నవంబరు 15 : రాజీపేట గ్రామంలో ఉన్న శంబలనగరి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆకాశజ్యోతి వెలిగించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్‌ విచ్చేసి ఆకాశజ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, జీఎస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మండల కేంద్రమైన జామి శ్రీ స్వర్ణాకర్ష త్రిపురాంతకస్వామి ఆలయ ఆవరణలో రైతులు జ్వాలాతోరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు.

ఘనంగా కుంభాభిషేకం

కొత్తవలస, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తుమ్మికాపల్లి గేట్‌ సమీపంలోనున్న శ్రీసంతోషిమాత అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే మహిళలు క్యూలైన్‌లలో బిందెలతో నీళ్లు పట్టుకుని అమ్మవారికి అభిషేకాలను చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వివిధ శివాలయాలలో ఉదయం రుద్రాభిషేకాలను నిర్వహించారు.

బొబ్బిలి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా బొబ్బిలి ప్రాంతంలోని ఆలయాలు, నదీతీరాలు దీపాల వెలుగులో శోభాయమానమయ్యాయి. వేకువ జామునుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పెంట, పారాది, అలజంగి, కారాడ వేగావతి నదీ పరీవాహక ప్రాంతాలలో భక్తులు స్నానమాచరించి.. నదిలో దీపాలను విడిచిపెట్టారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీవేణుగోపాల స్వామి, శ్రీఆంజనేయ స్వామి ఆలయాల్లో లక్ష దీపారాధన చేశారు.

Updated Date - Nov 16 , 2024 | 12:36 AM