వైభవంగా కార్తీక పౌర్ణమి
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:14 AM
జిల్లా ప్రజలు శుక్రవారం కార్తీక పౌర్ణ మిని వైభవంగా జరుపుకొన్నారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, డెంకాడ, గజపతినగరం తదితర మండలాల్లో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు.
- ఆలయాల వద్ద జ్వాలాతోరణాలు
విజయనగరం రూరల్, నవంబరు 15: (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు శుక్రవారం కార్తీక పౌర్ణ మిని వైభవంగా జరుపుకొన్నారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, డెంకాడ, గజపతినగరం తదితర మండలాల్లో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుకావడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు. మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేశారు. పలువురు నోములు నోచారు. వాయనాలు ఇచ్చారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. విజయనగరంలోని వీరరాజేశ్వరస్వామి, ఉమారామలింగేశ్వర స్వామి, కొత్త ఆగ్రహరంలోని కాశీవిశ్వేశ్వర స్వామి, రింగురోడ్డులోని పశుపనాథేశ్వర స్వామి ఆలయాల వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.