Share News

బియ్యం, కందిపప్పు ధరల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Jul 09 , 2024 | 11:27 PM

నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యే కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తెలిపారు.

బియ్యం, కందిపప్పు ధరల నియంత్రణకు చర్యలు

పార్వతీపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యే కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ డీలర్లతో సమీక్షించారు. జిల్లాలో ప్రజలకు స్థిరమైన ధరలకు నాణ్యమైన వస్తువులను అందించాలన్నారు. ప్రత్యేక కౌంటర్లలో దేశవాళీ రకం కంది పప్పు కిలో రూ.160, బీపీటీ లేదా సోనామసూరి స్టీమ్డ్‌ రైస్‌ కిలో రూ.49, ముడి బియ్యం కిలో రూ.48 విక్రయించాలని ఆదేశించారు. ఈ మేరకు బ్యానర్లను ప్రదర్శించాలని సూచించారు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మిన సరుకుల పరిణామం, వినియోగదారుల సంఖ్య, రోజువారి ధరల వివరాలను తెలియజేసేలా రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది విక్రయాలను పర్యవేక్షించి.. రోజువారీ నివేదికను అందిస్తారని తెలిపారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు, విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల , మార్కెటింగ్‌ శాఖల అధికారులు శివ ప్రసాద్‌, ఎల్‌.అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 11:27 PM