Anemia రక్తహీనత నివారణకు చర్యలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:50 PM
Measures to Prevent Anemia ఐటీడీఏ పరిధిలో రక్తహీనత (అనీమియా) కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
పాలకొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో రక్తహీనత (అనీమియా) కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ కారణంగానూ మాతాశిశువులకు ఎటువంటి ప్రమాదం జరగకూడదన్నారు. శుక్రవారం పాలకొండ మండలం కొండాపుర గ్రామంలో పర్యటించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం గర్భిణుల రికార్డులను పరిశీలించిన ఆయన స్థానిక వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రతి గర్భిణీ సుఖ ప్రసవం కావాలంటే రక్తహీనత లేకుండా చూడాలని సూచించారు. అంగన్‌వాడీల ద్వారా సక్రమంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలని గర్భిణులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి ఎస్.మన్మఽథరావు అన్నవరం పీహెచ్‌సీ వైద్యాధికారి, ఏఎన్‌ఎంలు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
అధికారుల సహకారంతో సాధ్యం ..
పార్వతీపురం రూరల్: జిల్లా అధికారుల సహకారంతో రక్తహీనత నివారణ సాధ్యమని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. శు క్రవారం పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో ఎనీమియా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతినెలా హిమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు గృహ సందర్శనలు చేసి గర్భిణులు, బాలింతలకు ఐరెన్స్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించాలని సూచించారు. సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు, సీడీపీవో బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.