Share News

ఫైలేరియా వ్యాప్తి చెందకుండా చర్యలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:48 PM

బలిజిపేట మండలం పెద్దపెంకిలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు.

ఫైలేరియా వ్యాప్తి చెందకుండా చర్యలు
విజయనగరంలో జరిగిన సమావేశంలో ఏనుగుల సమస్యపై డిప్యూటీ సీఎంకు వివరిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, అక్టోబరు21 (ఆంధ్రజ్యోతి) : బలిజిపేట మండలం పెద్దపెంకిలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం విజయనగరం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. బోద వ్యాప్తి చెందకుండా పరిసరాల పరిశ్రుభత, ఇతర ఆరోగ్య పరిస్థితులపై చర్యలు చేపట్టాలన్నారు. 2016-17లో బలిజిపేట మండలంలో పర్యటించినప్పుడు ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏప్రిల్‌ నెల నుంచి విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, ఫాగింగ్‌ కూడా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. రక్షిత పథకాల వద్ద క్లోరినేషన్‌ చేస్తున్నామన్నారు.

ఏనుగుల సమస్యను పరిష్కరించండి

జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ కోరారు. గజరాజుల వల్ల ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా సంభవిస్తుందని, పంటలు కూడా నాశనమవుతున్నాయని తెలిపారు. జిల్లాకు కుంకీలను రప్పించి.. ఏనుగుల బెడద తప్పించాలన్నారు. మారుమల గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

Updated Date - Oct 21 , 2024 | 11:49 PM