నచ్చిన మిల్లుకే ధ్యానం
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:45 PM
ధాన్యం సేకరణలో ఈసారి ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలమైన మార్పులు చేసింది. పంటను తనకు నచ్చిన మిల్లుకు అందజేసే వెసులుబాటు కల్పించింది. ముందస్తుగా కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నచ్చిన మిల్లుకే ధ్యానం
ఈ ఏడాది ధాన్యం సేకరణలో మార్పులు
లక్ష్యం.. 3.20 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):
ధాన్యం సేకరణలో ఈసారి ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలమైన మార్పులు చేసింది. పంటను తనకు నచ్చిన మిల్లుకు అందజేసే వెసులుబాటు కల్పించింది. ముందస్తుగా కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వైసీపీ హయంలో అధికారులు చెప్పిన మిల్లులకే రైతులు ధాన్యం తీసుకువెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. కొందరు దూరం ప్రాంతంలో ఉన్న మిల్లులకు వెళ్లాల్సి వచ్చేది. తీరా అక్కడకు వెళ్లాడ చాంతాడు క్యూ ఉండేది. ట్రాక్టర్ లోడును అన్‌లోడ్ చేయడానికి రోజుల కొద్దీ సమయం పట్టేది. అందుకు ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. ఈసారి అలా కాకుండా రైతుకు నచ్చిన మిల్లుకు నేరుగా రైతు సేవా కేంద్రం నుంచి ధాన్యం తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ మొదలైంది. ఈ ఏడాది రైతుల నుంచి 507 రైతు సేవా కేంద్రాల ద్వారా పంట సేకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 80లక్షలు గోనె సంచులు అవసరమని అధికారులు నిర్ణయించారు. 135 మిల్లుల నుంచి రూ.250 కోట్లు బ్యాంకు గ్యారెంటీలు తీసుకోనున్నారు. సాధారణ రకం క్వింటా వద్ద రూ.2300 చొప్పున చెల్లించనున్నారు. దీనికి అదనంగా హమాలీ చార్జీల కింద ప్రతి క్వింటాకు రూ.17.17 చెల్లిస్తారు. గోనె సంచులను పౌర సరఫరా సంస్థ అందిస్తుంది. ఒక వేళ రైతులు ఏర్పాటు చేసుకుంటే 40 కేజీల సంచికి రూ.3.39 చెల్లిస్తారు. ధాన్యం రవాణా చేసేందుకు జీపీఎస్ అమర్చి ఉన్న వాహనాలనే అనుమతిస్తారు. రవాణా చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులు ధాన్యం విక్రయించిన సమయంలో ఎఫ్‌టివో అథంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇంకా అందని రవాణా.. హమాలీ చార్జీలు
2021-22 ఖరీఫ్ సీజన్‌లో 76 వేల మంది రైతుల నుంచి 4 లక్షల 21 వేలు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. బిల్లులైతే చెల్లించారు కాని హమాలీ, రవాణా చార్జీలు మాత్రం అందజేయలేదు. ధాన్యం సేకరించినందుకు పీఏసీఎస్‌లు(పాక్స్), గిరి మిత్ర, ఇందిర క్రాంతి పథం సంఘాలకు కమీషన్ రూపంలో ఐదు విడతలుగా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి రూ.9కోట్లు ఉమ్మడి జిల్లాకు విడుదలయ్యాయి. వాటిలో క్వింటాకు రూ.33 కమీషన్ కాగా సుమారు ఆరు రూపాయల వరకూ తాత్కాలిక సిబ్బంది జీతాలకు, వివిధ పరికరాలు కొనుగోలుకు కేటాయించాలి. మిగిలిన రూ.27 హమాలీ చార్జీలు చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. అప్పట్లో చాలా మంది రైతులు సొంతంగా హమాలీ చార్జీలు పెట్టుకున్నారు. హమాలీ చార్జీలతో పాటు రవాణా చార్జీలు అందజేయాలని అనేకసార్లు రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.