Share News

అదనపు తాగునీటి పథకానికి మోక్షం ఎప్పుడో?

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:28 PM

బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు అమృత్‌ పథకం కింద రూపొందించిన అదనపు రక్షిత పథకానికి ఏళ్ల తరబడి మోక్షం కలగడం లేదు.

అదనపు తాగునీటి పథకానికి మోక్షం ఎప్పుడో?
బొబ్బిలి ఐటీఐ కాలనీలో నిలిచిపోయిన తాగునీటి రిజర్వాయరు పనులు

- పునాదులకే పరిమితమైన ట్యాంకుల నిర్మాణం

- పట్టించుకోని గత సర్కారు

- బిల్లులు ఇవ్వక పనులు ఆపేసిన కాంట్రాక్టరు

- బొబ్బిలి ప్రజలకు తప్పని తాగునీటి కష్టాలు

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

(బొబ్బిలి)

బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు అమృత్‌ పథకం కింద రూపొందించిన అదనపు రక్షిత పథకానికి ఏళ్ల తరబడి మోక్షం కలగడం లేదు. మున్సిపల్‌ ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సీతానగరంలోని సువర్ణముఖినది నుంచి బొబ్బిలికి నీటిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశారు. 2016 అక్టోబరులో అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ తూముల అచ్యుతవల్లి నేతృత్వంలో పాలకవర్గసభ్యులంతా ఢిల్లీ వెళ్లి అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి తాగునీటి పథకానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఆయన చొరవతో ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నిధులు రూ.93.62 కోట్లు మంజూరయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు బొబ్బిలి తారకరామకాలనీ పాఠశాల ప్రాంగణంలో ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకం కింద రాజానగర్‌ కాలనీ, పోలీసుస్టేషన్‌ ఎదురుగా, స్వామివారివీధిలో, ఐటీఐ కాలనీలో 2,360 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఐటీఐ కాలనీలో ట్యాంకు నిర్మాణం పునాదులతో నిలిచిపోయింది. కాంట్రాక్టర్‌కు భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడంతో పనులు నిలిచిపోయినట్లు తెలిసింది. గత ఏడాది వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా మరోసారి శంకుస్థాపన జరిగింది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక పోలీసుస్టేషన్‌ ఎదురుగా శంకుస్థాపన చేసి తాగునీటికి సంబంధించి విపరీతమైన హామీలను గుప్పించారు. అవన్నీ నీటిమూటలయ్యాయి. కూటమి ప్రభుత్వమైనా ఈ తాగునీటి పథకం పనులను పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

వాటర్‌వర్క్స్‌ ద్వారా అరకొర సరఫరా

ప్రస్తుతం భోజరాజపురంలోని వేగావతి నది నుంచి ప్రధాన వాటర్‌వర్క్స్‌ ద్వారా బొబ్బిలి మున్సిపాల్టీకి తాగునీరు అందుతుంది. అయితే, పట్టణ జనాభా పెరగడంతో వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రతిరోజూ నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. మున్సిపాల్టీలో 31 వార్డులు ఉండగా కొన్ని వార్డులకు మాత్రమే కుళాయిల ద్వారా సక్రమంగా నీరందుతుంది. గొల్లపల్లి, తారకరామాకాలనీ, స్వామివారివీధి, గొల్లవీధి, ఇందిరమ్మకాలనీలకు తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆయా వార్డుల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక వార్డుల్లో మనిషిలోతు గుంతలు ఏర్పాటు చేసుకొని తాగునీటిని సేకరించుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. కాగా, వాటర్‌ వర్క్స్‌ నిర్వహణకు, పైపులైన్ల లీకేజీలు అరికట్టడానికి, మోటార్లు బాగుచేయడానికి ప్రతిఏటా లక్షలాది రూపాయలను మున్సిపాలిటీ నుంచి వెచ్చిస్తుండ డంతో అటు అధికార పార్టీ కౌన్సిలర్లు, ఇటు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల వ్యయంలో నియంత్రణ, పారదర్శకత ఉండాలని చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రజలకు సక్రమంగా తాగునీటిని అందించాలంటే ఆ మాత్రం తప్పదని అంటున్నారు. ఏదేమైనా అదనపు తాగునీటి పథకం పనులు పూర్తయితేనే బొబ్బిలి మున్సిపాలిటీకి నీటి కష్టాలు తప్పుతాయి.

ఆరు రోజులకోసారి సరఫరా

బొబ్బిలి 8వ వార్డుకు ఆరు రోజులకోసారి కుళాయి నీటిని అందిస్తున్నారు. ఆ నీరు దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆ నీటితో స్నానం చేస్తే దురదలు వస్తున్నాయని వాపోతున్నారు. గత 15 ఏళ్లుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచరవీధి గట్టు ప్రాంతం నుంచి దాటుకొని గొల్లపల్లి గ్రామానికి తాగునీటి సరఫరా అధ్వానంగా ఉంది. గూల వీధి తదితర ప్రాంతాలకు 15 రోజుల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదు. తాగునీటి సరఫరా కోసం వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వమే కారణం

బొబ్బిలి పట్టణంలో తాగునీటి కోసం ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి గత వైసీపీ ప్రభుత్వమే కారణం. అదనపు తాగునీటి పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారిమళ్లించింది. దీంతో పనులు పూర్తి కాలేదు. ఎన్నికల ముందు వైసీపీ నాయకులు ఈ పథకానికి రెండో సారి శంకుస్థాపన చేసి హడావుడి చేశారు. పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకెళ్లలేదు.

-కాగాన సునీల్‌కుమార్‌, ఐటీఐ కాలనీ

గడువు పెంచాల్సి ఉంది

ఉమ్మడి జిల్లాలో తాగునీటి పథకాల కోసం మంజూరైన ఏఐఐబీ నిధులకు సంబంధించి ఐదేళ్ల గడువు పూర్తయింది. ఈ గడువును మరోసారి పెంచాల్సి ఉంది. విజయనగరం, నెలిమర్ల, బొబ్బిలి, రాజాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండకు అమృత్‌ పథకం కింద తాగునీటి పథకాలను మంజూరు చేశారు. ఐటీఐ కాలనీలో రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు నిలిచిపోయాయి. కేంద్ర స్థాయిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం గట్టిగా కృషి చేస్తున్నారు.

- దక్షిణామూర్తి, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ, విజయనగరం

పరిస్థితిని చక్కదిద్దుతాం

తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను చక్కదిద్దుతాం. నాణ్యమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్లోరినేషన్‌ చేయిస్తున్నాం. సాంకేతిక సమస్యలను అధిగమించి సమస్యను పరిష్కరిస్తాం. ఇప్పటికే తాగునీటి శాంపిల్స్‌ను పరీక్షించాం.

- లాలం రామలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - Jul 26 , 2024 | 11:28 PM