కేంద్ర పథకాలతో మరింత తోడ్పాటు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:36 AM
కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లా అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తోందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ,సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని, మరో 20 త్వరలో అమలు కానున్నాయని చెప్పారు.
కేంద్ర పథకాలతో మరింత తోడ్పాటు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లా అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తోందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ,సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని, మరో 20 త్వరలో అమలు కానున్నాయని చెప్పారు. జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర పథకాలను సద్వినియోగం చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. వాటిపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భారీ వాహనాలను వినియోగించడంతో పలు చోట్ల స్థానిక రోడ్లు దెబ్బతిన్నాయని, సామాజిక బాధ్యతగా ఆ రహదారులను ఆయా కాంట్రాక్టర్లతో బాగు చేయించాలని సూచించారు. దిశ కమిటీ చైర్మన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మార్పు కోసం అధికారులు, ప్రజాప్రతినిఽధులు సమన్వయంతో కలిసి కృషి చేద్దామన్నారు. కేంద్ర పథకాల అమల్లో గాని, ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో గాని ఎక్కడా రాజీపడవద్దని కోరారు. కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ వినియోగానికి ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ కోసం ఏర్పాటు చేస్తున్న 93 ఫీడర్స్ పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, లోకం మాధవి, జడ్పీ సీఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.