Share News

టెన్షన్‌ లేకుండా పింఛన్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:22 PM

పింఛనుదారులకు ఈసారి అంతా ప్రత్యేకమే. మొదటిసారిగా పెద్దమొత్తంలో పింఛను అందుకోనున్నారు. అది కూడా వారి ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు వెళ్లి పింఛను అందివ్వనున్నారు.

టెన్షన్‌ లేకుండా పింఛన్‌

టెన్షన్‌ లేకుండా పింఛన్‌

పంపిణీకి సన్నద్ధమవుతున్న ప్రభుత్వం

సచివాలయ సిబ్బందితోనే పంపిణీ

జిల్లాలో 2.81 లక్షల మంది అర్హులు

ఇంటింటికీ వెళ్లి అందించాలన్న ప్రభుత్వం

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జూన్‌27 : పింఛనుదారులకు ఈసారి అంతా ప్రత్యేకమే. మొదటిసారిగా పెద్దమొత్తంలో పింఛను అందుకోనున్నారు. అది కూడా వారి ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు వెళ్లి పింఛను అందివ్వనున్నారు. కొత్త ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకుంది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి వద్దకే వెళ్లి అందించాలని నిర్దేశించింది. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ఉత్తర్వులు కూడా జారీచేసింది. పింఛను పెంపు మూడు నెలల కిందటి నుంచే వర్తింపజేసింది. దీంతో సాధారణ పింఛనుదారులు రూ.7వేలు చొప్పున అందుకోనున్నారు. అనంతరం ప్రతి నెలా రూ.4 వేలు చొప్పున పెన్షన్‌ అందుకోనున్నారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్దేశించింది. ఇదే విషయాన్ని తాజాగా గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌లకు చీఫ్‌ సెక్రటరీ స్పష్టం చేశారు.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 530, పట్టణ ప్రాంతాల్లో 96 సచివాలయాలు ఉన్నాయి. మొత్తంగా 626 సచివాలయాల్లోని 5,634 మంది సిబ్బంది పింఛను పంపిణీ చేస్తారు. వీలైనంతవరకు జూలై 1వ తేదీ నాడే పింఛన్ల పంపిణీ పూర్తి చెయ్యాలని, లేదంటే 2వ తేదీ నాటికి పూర్తి కావాలని సీఎస్‌ సూచించారు. ఇదే విషయయపై గురువారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులతో కలెక్టర్‌ అంబేడ్కర్‌ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రం నుంచి డీఆర్‌డీఏ పీడి కళ్యాణచక్రవర్తి, డీపీవో శ్రీధర్‌రాజా తదితరులు పాల్గొన్నారు. 50 నుంచి 60 మంది పింఛనుదారులను ఓ క్లస్టర్‌గా చేసి, అందుకు తగ్గట్లు మ్యాపింగ్‌ చెయ్యాలని ఆదేశించారు. జిల్లాలో 2లక్షల 81 వేల 713 మంది పింఛన్‌దారులు ఉన్నారు. సాధారణ పింఛనుదారునికి రూ.4 వేలు, వికలాంగులకు రూ.6వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చారు.

----------------

Updated Date - Jun 27 , 2024 | 11:22 PM