ప్రజల సొమ్ము రాళ్ల పాలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:34 AM
రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నది నానుడి.. గత ఐదేళ్ల జగన్ పాలనలో జనం సొమ్ము రాళ్ల పాలు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారు. రాళ్లపై మాజీ సీఎం తన బొమ్మలు వేసుకోవడానికి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేటాయించారు. ‘వైఎస్సార్ జగనన్న భూసురక్ష 2020’ పేరిట సర్వేకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేశారు. నాటి అనాలోచిత నిర్ణయాలకు కొంతమంది అధికారులు వంతపాడారు. ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అదనంగా ఖర్చుచేయాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రజల సొమ్ము రాళ్ల పాలు
సర్వే రాళ్లకు రూ.44 కోట్లు
వాటితో సమస్యలే అధికం
ఇప్పుడు రూ.కోటితో పేర్లు తొలగింపు
విజయనగరం, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి):
రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నది నానుడి.. గత ఐదేళ్ల జగన్ పాలనలో జనం సొమ్ము రాళ్ల పాలు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారు. రాళ్లపై మాజీ సీఎం తన బొమ్మలు వేసుకోవడానికి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేటాయించారు. ‘వైఎస్సార్ జగనన్న భూసురక్ష 2020’ పేరిట సర్వేకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేశారు. నాటి అనాలోచిత నిర్ణయాలకు కొంతమంది అధికారులు వంతపాడారు. ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అదనంగా ఖర్చుచేయాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో 32 మండలాల్లో 963 రెవెన్యూ గ్రామాలకుగాను 503 గ్రామాల్లో భూముల రీసర్వే చేశారు. ఆ తరువాత జగనన్న భూసురక్ష పేరిట 6,84,479 సర్వే రాళ్లు పాతారు. ఇందు కోసం రూ.కోట్లు కేటాయించారు. పొలాల హద్దుల్లో పాతడానికి గ్రానైట్ రాయినే వినియోగించాలని.. దీనిపై జగన్ చిత్రం, పేరు ఉండేలా చూడాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు సూచించారు. అప్పట్లో ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో పేరుకే పరిమితం చేశారు. రాయిపై పేరు చెరిగిపోకుండా ఉండాలని అప్పట్లో టెండరు ప్రక్రియలో నిబంధన పెట్టారు. ఉత్తరాంధ్ర మొత్తం ప్యాకేజీ-1 కింద ఒక్కో రాయికి రూ.500తో పాటు రవాణా, పాతేందుకు రూ.150 వ్యయం చేశారు. జిల్లాలో 7 లక్షల వరకూ రాళ్లను సరఫరా చేశారు. వాటిని కూడా చాలావరకూ పాతకుండా విడిచిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిల్వలు ఉన్నాయి. కాగా సర్వే రాళ్ల కొనుగోలుకు రూ.34.22 కోట్లు, రవాణాకు రూ.10.26 కోట్ల బిల్లులు చెల్లించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కూటమి ప్రభుత్వం చెక్..
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఆర్భాటాలకు చెక్ చెప్పింది. సర్వే రాళ్లపై జగన్ పేరును తొలగిస్తోంది. ఒక్కో రాయిపై ఉన్న పేర్లు తొలగింపునకు రూ.15లు అందిస్తూ ఓ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రతినిధులు గ్రామాల్లో సర్వేరాళ్లపై వాటిని తొలగించే పనిలో పడ్డారు. ఇందుకుగాను కోటి రూపాయల వరకూ ఖర్చవుతోంది. అప్పట్లో సర్వే రాళ్ల పేరిట భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలున్నాయి.
సమస్యలూ అధికమే
సర్వే ప్రక్రియతో గ్రామాల్లో భూ సమస్యలూ అధికమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల యజమానులకు ఉన్న భూములకంటే తక్కువ విస్తీర్ణం ఉన్నట్టు.. తక్కువ ఉన్నవారికి ఎక్కువ ఉన్నట్టు చూపించారు. దీనిపై భూ యజమానులు ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన రెవెన్యూ సదస్సుల్లో దీనిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని సరిచేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.