Share News

పేరుకే ఫిజియోథెరపీ

ABN , Publish Date - Mar 30 , 2024 | 11:57 PM

శరీరంలో ఏదైనా అవయవం ప్రమాదానికి గురైనా.. చచ్చుబడినా... మునుపటి స్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ. జిల్లాలోని పేదలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ముందు గుర్తుకొచ్చేది విజయనగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రే. పెద్ద ఆస్పత్రిగా చెప్పుకుంటారు.

పేరుకే ఫిజియోథెరపీ
ఫిజియోథెరపీ వార్డులో పనిచేయని షార్ట్‌వేవ్‌ డయాథెర్మి పరికరం

పేరుకే ఫిజియోథెరపీ

పెద్దాసుపత్రిలో కానరాని కీలక వైద్యం

డాక్టర్లున్నా ఉపయోగం లేని వైనం

మూలకు చేరిన పాత పరికరాలు

కొత్తవి సమకూర్చని ప్రభుత్వం

రోగులకు ప్రైవేటు ఆసుపత్రులే గతి

శరీరంలో ఏదైనా అవయవం ప్రమాదానికి గురైనా.. చచ్చుబడినా... మునుపటి స్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ. జిల్లాలోని పేదలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ముందు గుర్తుకొచ్చేది విజయనగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రే. పెద్ద ఆస్పత్రిగా చెప్పుకుంటారు. కానీ కీలకమైన ఫిజియోథెరపీ వైద్యం కోసం వెళ్లేవారికి అక్కడ నిరాశే ఎదురవుతోంది. ఎన్నాళ్లయినా సమస్య తగ్గడం లేదు. కారణం కీలకమైన పరికరాలు పనిచేయకపోవడమే. దీంతో చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా రోగులకు నొప్పి నివారణకు ఉపయోగించే షార్ట్‌వేవ్‌ డయాథెర్మి పరికరం నెల రోజులుగా మూలకు చేరింది. వైద్యులు ఉన్నా ఉపయోగం ఉండడం లేదు.

(విజయనగరం రింగురోడ్డు)

జీవన శైలిలో లోపాల వల్ల ఓదైనా అవయవానికి హాని కలిగినప్పుడు కాని, ప్రమాదాల్లో గాయాలైనప్పుడు కాని, నొప్పులతో బాధపడేవారికి కాని ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. జిల్లా ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా పెద్దాసుపత్రికే క్యూ కడతారు. ఫిజియోథెరపీ కోసం అక్కడికి వెళ్లేవారు చాలా వరకు అసంతృప్తితో బయటకు వస్తున్నారు. చివరకు విసిగి మళ్లీ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రి బోధనాస్పపత్రిగా మారడంతో మరిన్ని వైద్య సదుపాయాలు లభిస్తాయని ప్రజలు ఆశించారు కాని స్థాయి పెరిగినా వైద్యం మెరుగవ్వలేదు. సదుపాయాలూ పెరగలేదు.

ఫిజియోథెరపీని నిర్దేశిత పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా సాంత్వన చేకూర్చుతారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ముగ్గురు ఫిజియోథెరిపిస్టులు, ఒక రియాబిలిటేషన్‌ వర్కర్‌, సిబ్బంది ఉన్నారు. రోగులకు చికిత్స అందించే ఫిజియోథెరపీ పరికరాలు చాలా వరకూ మరమ్మతులకు గురయ్యాయి. కొత్తవి రావడం లేదు. దీంతో సిబ్బంది ఖాళీగా కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రోగులకు నొప్పి నివారణకు ఉపయోగించే షార్ట్‌వేవ్‌ డయాథెర్మి నెల రోజులుగా మరమ్మతులకు గురైంది. బాగుచేసే నాథుడు లేడు. మిగిలిన పరికరాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోజుకు 100 మందికి పైగా రోగులు ఫిజియోథెరపీ చేయించుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. కొత్త పరికరాలు లేకపోవడం, పాతవి పనిచేయకపోవడంతో వేరే దారి లేక వైద్యులే బయటకు పంపిస్తున్నారు. బయట ఫిజియోథెరపీ కేంద్రాల్లో ఒక రోగి నుంచి గంటకు రూ.1,000 వసూలు చేస్తున్నారు. దీంతో పేదవారు ఫిజియో థెరపీ చేయించుకోలేకపోతున్నారు.

- ఆసుపత్రిలో వివిధ అవయవాలకు శస్త్ర చికిత్సలు పూర్తయిన వారికి ఫిజియోథెరపీకి సిఫార్సు చేస్తున్నారు. పరికరాలు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పాత పరికరాలు మార్చి కొత్తవాటిని తీసుకురావాల్సి ఉంది. వైద్యశాఖ అధికారులు ఇక్కడి పరిస్థితిపై దృష్టి కేంద్రీకరించడం లేదన్న అభిప్రాయం రోగుల నుంచి వ్యక్తమౌతున్నది. మరోవైపు మహిళల విషయానికి వస్తే వారికి ఫిజియోథెరపీ కేంద్రం ప్రత్యేకంగా ఉండాలి. అదీ లేదు. గతంలో ఉన్న ఓ గదిని ఏఆర్‌టీ కౌన్సిలింగ్‌ కేంద్రానికి కేటాయించేశారు. ఆసుపత్రిలో సమస్యలు చెప్పుకునేందుకు, ఫిర్యాదులు అందించేందుకు హెల్ప్‌డెస్క్‌ గాని, కనీసం వారి ఫోన్‌ నెంబర్లు కూడా కనిపించవు. ఎవరిని అడిగినా.. నెంబర్లు చెప్పరు. ఫిజియోథెరపీ సేవలపై సూపరింటెండెంట్‌ డాక్టరు పి అనిలా సునందని వివరణ కోరగా, త్వరలోనే ఫిజియోథెరపీ విభాగంలో మరమ్మతులకు గురైన పరికరాలను బాగు చేయించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

Updated Date - Mar 30 , 2024 | 11:57 PM