Share News

అధ్యక్షా..!

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:42 PM

జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గళమెత్తారు. నిధులు కేటాయించి.. పరిష్కారం మార్గం చూపించాలని కోరారు.

 అధ్యక్షా..!

అసెంబ్లీలో గళమెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు

పార్వతీపురం, నవంబరు16 (ఆంధ్రజ్యోతి)/గుమ్మలక్ష్మీపురం/పాలకొండ : జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గళమెత్తారు. నిధులు కేటాయించి.. పరిష్కారం మార్గం చూపించాలని కోరారు. శనివారం శాసన సభలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ... జిల్లాకేంద్రం అభివృద్ధికి దూరంగా ఉంది.. నూతన జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. పట్టణం మీదుగా విశాఖపట్నం నుంచి రాయపూర్‌ వెళ్లే భారీ వాహనాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఎంతోమంది ప్రమాదాలకు గురువు తున్నారు ఈ ప్రమాదాల నివారణకు బైపాస్‌ రహదారి నిర్మాణం ఎంతో అవసరం. అదే విధంగా జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వేలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. తోటపల్లి ప్రాజెక్టు విస్తరణ కూడా చేపట్టాలి.’ అని ఆయన కోరారు.

జీవోను పునరుద్ధరించాలి

గిరిజన ప్రాంతాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను పునరుద్ధరించాలని కురుపాం ఎమ్మెల్యే, విప్‌ తోయక జగదీశ్వరి శాసనసభలో కోరారు. ‘గతంలో కొండ శిఖర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసం రేకు ఇళ్లు మంజూరు చేశారు. హుద్‌హుద్‌, తితలీ తుఫాన్ల కారణంగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. 2018లో పీవీటీజీలకు ఇళ్లు కేటాయించినట్లుగానే ప్రస్తుతం మిగతా గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయాలి.’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆధునికీకరణ పనులు పూర్తి చేయండి

‘పాలకొండ, వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలాలకు సాగునీరు అందించే తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి. గత టీడీపీ ప్రభుత్వం 2018-19లో రూ.195.34 కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటి పనులను నిలిపివేసింది. పాలకొండ నియోజకవర్గ రైతులక ఎంతగానో ఉపయోగపడే ఈ కాలువ ఆధునికీరణకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలి.’ అని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసెంబ్లీలో కోరారు.

Updated Date - Nov 16 , 2024 | 11:42 PM