ఇక ప్రైవేట్ మద్యం దుకాణాలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:07 PM
గత వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటి స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేసింది.
- నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
- 9 వరకు దరఖాస్తుల స్వీకరణ
- 11న లాటరీ ద్వారా ఎంపిక
-12 నుంచి అందుబాటులోకి..
- ఉమ్మడి జిల్లాలో 223 షాపులు
విజయనగరం (ఆంధ్రజ్యోతి) అక్టోబరు 1: గత వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటి స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకూ ఆన్‌లైన్‌లో గానీ.. ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షాపునకు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్‌గా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 11న లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 12 నుంచి కొత్త మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి జగన్ సర్కారు ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలకు గత నెల 30తోనే గడువు ముగిసింది. కానీ, ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటుచేసే వరకూ ప్రభుత్వ షాపులు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 223 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో విజయనగరం జిల్లాకు 165 (ప్రైవేట్ వ్యక్తులకు 149, గీత కార్మికులకు 16), పార్వతీపురం మన్యం జిల్లాకు 58 (ప్రైవేట్ వ్యక్తులకు 53, గీత కార్మికులకు 5) షాపులను కేటాయించనున్నారు.
పాత ప్రీమియం బ్రాండ్లు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత ప్రీమియం బ్రాండ్ మద్యం అందుబాటులోకి తెస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో ధరలకు అనుగుణంగా ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధరను రూ.99గా నిర్ణయించారు. గతంలో ఉండే ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అప్పటి ధరకు అటుఇటుగా అందించనున్నారు. జనాభా ప్రాతిపదికన నాలుగు శ్లాబుల్లో లైసెన్స్‌దారుల నుంచి డిపాజిట్లను వసూలు చేయనున్నారు. పదివేల జనాభా లోపు రూ.5 లక్షలు, 50 వేల లోపు రూ.50 లక్షలు, 50 వేలు దాటి లక్షలోపు జనాభా ఉంటే రూ.65 లక్షలు, లక్ష దాటి జనాభా ఉంటే రూ.85 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
షాపులు దక్కించుకునేందుకు పోటీ
ప్రైవేట్ మద్యం షాపులు దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారులు పోటీ పడుతున్నారు. భారీ స్థాయిలో దరఖాస్తులు చేయాలని భావిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవడానికి వెసులబాటు ఉండడంతో చాలా మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ వ్యాపారంలో అనుభవం ఉన్నవారు తమ అనుచరులు, బినామీలు, బంధువుల పేరుతో దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో కొందరు ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు చెందిన తమ బంధువులను కూడా రంగంలోకి దించుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని షాపులను దక్కించుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టారు.
షాపుల్లో నో స్టాక్..
నెల్లిమర్ల బాట్లింగ్ యూనిట్ డిపో నుంచి గత నెల 18 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరుకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రస్తుతం ఏ షాపు ముందు చూసినా నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. కేవలం చీప్ లిక్కర్ మాత్రమే లభిస్తోంది. ఇదే అదునుగా బార్లలో మద్యం ధరలను అమాంతం పెంచేశారు. రూ.220కు అమ్మాల్సిన బీరును రూ.300కుపైగా విక్రయిస్తున్నారు. ఈ నెల 12 వరకూ తమకు ఈ కష్టాలు తప్పవని మందుబాబులు నిట్టూరుస్తున్నారు.
12 నుంచి కొత్త మద్యం పాలసీ: ఎక్సైజ్, ప్రొహిబిషన్ డీసీ బాబ్జీరావు
విజయనగరం క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తుందని ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు అన్నారు. మంగళవారం స్థానిక బ్యాంకు కాలనీలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ మద్యం దుకాణాల కోసం ఈ నెల 9లోగా దరఖాస్తు చేసుకోవాలని, 11న కలెక్టర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. షాపు లైసెన్సు ఫీజులను ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆరు విడతలుగా చెల్లించాలని చెప్పారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ మన్మథరావు పాల్గొన్నారు.