Share News

ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:38 AM

పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్‌ మృతి చెందాడు. ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

  ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా

ముగ్గురు విద్యార్థులకు స్పల్ప గాయాలు

బెలగాం/ పార్వతీపురం రూరల్‌, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్‌ మృతి చెందాడు. ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు, విద్యార్థుల కథనం ప్రకారం... పాఠశాల ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 25 మంది విద్యార్థులతో ఒక ప్రైవేట్‌ పాఠశాల బస్సు పార్వతీపురం నుంచి బాలగుడబ వైపు బయల్దేరింది. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ గ్రామ సమీపంలో డ్రైవర్‌ నిర్లక్ష్యంతో బస్సు బోల్తా పడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి ఆర్తనాదాలు విని స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బస్సులో ఉన్న విద్యార్థులకు బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో బస్సు కింద పడి అదే గ్రామానికి చెందిన క్లీనర్‌ పెంకి మురళి(26) అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో తరగతి చదువుతున్న సుస్మితకు తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రవళ్లిక, ఐదో తరగతి చదువుతున్న ఓంకారకు స్పల్ప గాయాలయ్యాయి. వారిలో సుస్మితను ప్రైవేట్‌ ఆసుపత్రికి, మిగతా ఇద్దరిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని రూరల్‌ ఎస్‌ఐ సంతోషికుమారి వివరాలు సేకరించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నన్నట్లు తెలిపారు.

విద్యార్థులను కాపాడి..

బస్సు డోర్‌ వద్ద ఉన్న క్లీనర్‌ మురళి వాహనం బోల్తా పడిన సమయంలో రెండు చేతులు చాచి విద్యార్థులకు రక్షణగా నిలిచిడు. వారు పడిపోకుండా కాపాడాడు. అయితే బస్సు కింద పడిపోయిన మురళి అక్కడికక్కడే మృతి చెందినట్లు విద్యార్థులు తెలిపారు. మృతిడికి తల్లిదండ్రులు ఒక సోదరుడు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడిని కోల్పోడంతో వారు భోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన క్లీనర్‌ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరుపై రూరల్‌ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

Updated Date - Dec 07 , 2024 | 12:38 AM