Share News

ప్రజాధనం రాళ్లపాలు

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:55 AM

గత వైసీపీ ప్రభుత్వం సర్వే రాళ్ల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చింది. రీసర్వే భూముల్లో పాతడానికి తెచ్చిన రాళ్లలో దాదాపు 40 వేలకు పైగా రాళ్లు జిల్లాలో వివిధ చోట్ల వృథాగా పడిఉన్నాయి.

ప్రజాధనం రాళ్లపాలు
కొత్తవలస సమీపంలో వృథాగా పడి ఉన్న సర్వే రాళ్లు

- గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం

- జిల్లాలో 40 వేలకు పైగా సర్వే రాళ్లు వృథా

- రూ.2.2 కోట్లు నష్టం

సాలూరు రూరల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం సర్వే రాళ్ల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చింది. రీసర్వే భూముల్లో పాతడానికి తెచ్చిన రాళ్లలో దాదాపు 40 వేలకు పైగా రాళ్లు జిల్లాలో వివిధ చోట్ల వృథాగా పడిఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.2.2 కోట్లు ఉంటుందని అంచనా. వైసీపీ ప్రభుత్వం జగనన్న భూహక్కు.. భూ రక్ష పేరిట పార్వతీపురం మన్యం జిల్లాలో భూ సర్వే చేపట్టింది. పొలాల్లో గుర్తించిన హద్దుల్లో సర్వే రాళ్లను పాతేందుకు ఒక్కొక్క రాయిని రూ.500కు కొనుగోలు చేసింది. వాటి రవాణాకు మరో రూ.50 వరకు ఖర్చు చేసింది. మొత్తం రూ.22 కోట్ల పైబడిన వ్యయంతో 4.50 లక్షలకు పైగా సర్వే రాళ్లు తెప్పించారు. అధికారిక లెక్కల ప్రకారం 30 వేల రాళ్లు వృథాగా పడి ఉన్నాయని అధికారులు చెబుతున్నా, వాస్తవానికి అవి 40 వేలు ఉంటాయని రైతులు అంటున్నారు. ఈ రాళ్లు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల వీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. సాలూరు మండలం ముచ్చర్లవలసలో ఈ రాళ్లతో దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. బస్టాండ్ల వద్ద కూర్చునేందుకు కొందరు ఈ రాళ్లను బెంచీలుగా వినియోగిస్తున్నారు. రోడ్డు పక్కన పడి ఉన్న రాళ్లు ఏదోలా వినియోగపడుతుండడం సంతోషమని పలువురు చమత్కరిస్తున్నారు. ఇదిలా ఉండగా, పొలాల్లో పాతిన సర్వేరాళ్లపై జగనన్న పేరు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నడుంబిగించింది. దీనికోసం ఒక్కొక్క రాయికి రూ.15 రూపాయలు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో రాళ్లపై పేర్లు తొలగించడానికి రూ. 68.11 లక్షలు వ్యయం చేయనున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:55 AM