ప్రజాభిప్రాయమే కీలకం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:44 AM
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రయోగించిన ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టవ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం)ను సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా సేకరించిన అభిప్రా యాలకు విలువనివ్వడం ద్వారా పథకాలను సమర్థంగా అమలు చేయొచ్చునని ఆలోచిస్తున్నారు.
ప్రజాభిప్రాయమే కీలకం
ఐవీఆర్‌ఎస్‌తో సంక్షేమ పథకాల అమలు
తాజాగా నిర్ణయించిన ప్రభుత్వం
సర్వే ఆధారంగా మార్పులు, చేర్పులు
శృంగవరపుకోట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రయోగించిన ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టవ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం)ను సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా సేకరించిన అభిప్రా యాలకు విలువనివ్వడం ద్వారా పథకాలను సమర్థంగా అమలు చేయొచ్చునని ఆలోచిస్తున్నారు. ‘సంక్షేమ పథకాలతో జీవనప్రమాణాలు మెరుగ్గా వున్నాయా? కొత్తగా అమలు చేయాలనుకున్న పథకాలను ఏవిధంగా రూపకల్పన చేస్తే బాగుంటుందో చెప్పండి’ అని నేరుగా ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌లో ఫోన్ చేసి అడగను న్నారు. వారి నుంచి సేకరించిన అభిప్రాయాల్లో ఎక్కువ మంది వ్యక్తపరిచిన వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనున్నారు.
కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కొన్నింటిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ఉన్నాయి. మరోవైపు పథకాల నుంచి అనర్హులను ప్రభుత్వం తప్పించలేకపోతోంది. ఈ పరిస్థితిలో ఐవీఆర్‌ఎస్ సర్వే ఉపయోగపడు తుందని ప్రభుత్వం నమ్ముతోంది. కిలో రూపాయికి పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈబియ్యాన్ని తీసుకెళుతున్న లబ్ధిదారుల్లో సగానికి పైబడి వీటిని తినట్లేదు. బియ్యం వ్యాపారులకు కిలో రూ.12 నుంచి రూ.15 చొప్పున అమ్మేస్తున్నారు. ఈ బియ్యమే ఇప్పుడు కాకినాడ, గంగవరం పోర్టుల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. బియ్యం పొందుతున్నవారిలో అత్యధికశాతం మంది వాడటం లేదన్న విషయం ప్రభుత్వంలో వున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. తెల్లరేషన్ కార్డున్నవారందరికీ వీటిని సరఫరా చేయాలి. ఈకార్డే బీపీఎల్‌కు (బిలో పోవర్టీ లైన్-అత్యంత పేదరికం)సూచిక. దీన్ని అనుసరించే సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ రకాల రాయితీలు, ఉద్యోగ, ఉపాధిలో రిజర్వేషన్‌లను అమలు చేస్తుండడంతో ఈ కార్డులను ప్రతిఒక్కరూ పొందేందుకు చూస్తున్నారు.
- ఇతర వాటికి ఈ కార్డును ముడిపెట్టడబోమని గత వైసీపీ ప్రభుత్వం బియ్యం కార్డును వేరుగా ఇచ్చింది. అయినప్పటికీ ఎలాంటి ధ్రువపత్రం కావాలన్నా దీనినే అడుగుతున్నారు. వరసగా మూడు నెలలు బియ్యం తీసుకోకుంటే ఈ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉండడంతో అవసరం లేని వారు కూడా తీసేసుకుంటు న్నారు. ‘మాకెందుకీ బియ్యం, ఈ కార్డును పథకాలకు ముడిపెట్టకుండా వుంటే చాలని’ అనేవారు చాలా మంది వున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేమార్గం లేదు. ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా రేషన్ బియ్యం అవసరం లేని వారంతా ఈ విషయం చెప్పేందుకు అవకాశం వుంది. తద్వారా ఈ పథకంలో మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం ఉంటుంది.
- ప్రభుత్వం సామాజిక పింఛన్‌లను ఓ పండగలా ప్రతినెలా పంపిణీ చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేసింది. వీరు నాలుగైదు రోజులు అందించేవారు. కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒకే రోజు ఇచ్చేస్తున్నారు. ఈ పింఛన్‌ల పంపిణీ మరింత మెరుగ్గా చేసేందుకు ఐవీఆర్‌ఎస్ సర్వేలో వ్యక్తమైన అభిప్రాయా లను బట్టి ప్రభుత్వం నడుచుకుంటుంది. ఇలా ప్రస్తుతం ఇస్తున్న పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు పారదర్శకంగా చేసేందుకు అవకాశం వుంటుంది.
- ఉచిత ఇసుక విధానం, మద్యం నూతన పాలసీ వంటి వాటిపైనా ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన వాటి గురించి ప్రభుత్వం విశ్లేసించి సరిదిద్దుకొనేలా ప్రయత్నించవచ్చు. ఇలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించే ఆలోచన వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
-----------