Share News

పక్కాగా ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, రైతులకు అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

పక్కాగా ధాన్యం కొనుగోలు

- తొలివిడత 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణే లక్ష్యం

- జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

- ముందస్తుగానే గోనె సంచుల తరలింపు

గరుగుబిల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, రైతులకు అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.74 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. 3.20 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలివిడతగా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. వీరికి తమ విధి విధానాలపై సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. తూనికలతో పాటు తేమ శాతం, ట్రక్‌ షీట్లు, చెల్లింపులు ఎలా నిర్వహించాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు.

కేటగిరీలుగా విభజన

జిల్లాలోని 15 మండలాలను మూడు కేటగిరీలుగా విభజించారు. 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను కేటగిరీ-ఏగా 59, కేటగిరీ-బీగా 95, కేటగిరీ-సీగా 29 కేంద్రాలను విభజించారు. గుర్తించిన స్టాక్‌ పాయింట్లలోనే గోనె సంచులను భద్రపర్చాల్సి ఉంది. ఈ మేరకు ముందస్తుగానే గోనె సంచులు తరలింపునకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు అందించేందుకు 21,97,230 సంచులను సిద్ధం చేశారు. సంబంధిత రైస్‌ మిల్లుల నుంచి రెండు రోజుల్లో ఆయా కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా కేంద్రాల పరిధిలో గోనె సంచులను సంబంధిత పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, కస్టోడియన్‌ అధికారులు, ఇన్‌చార్జిలు శుభ్రమైన ప్రాంతాల్లో భద్రపర్చాల్సి ఉంది. మండలాల వారీగా నిర్దేశించిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలను చేరుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక.. తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

కస్టోడియన్‌ సిబ్బంది నియామకం

జిల్లాలో గుర్తించిన రైస్‌ మిల్లులకు కస్టోడియన్‌ అధికారులుగా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను నియమించారు. ఈ మిల్లుల నుంచి పీపీసీ కేంద్రాలకు గోనె సంచులను తరలించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేయకుండా ధాన్యం తరలింపు చేస్తే సంబంధిత కేంద్రంలోని సిబ్బంది కమిషన్‌ నుంచి బిల్లులు రికవరీ చేస్తారు. గతంలో జిల్లా పౌర సరఫరాలశాఖ నుంచి కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులను తరలించేవారు. అయితే, ఈ ఏడాది మిల్లర్ల నుంచి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. చిరిగిన గోనెసంచులు ఉంటే చర్యలు తీసుకుంటారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి. రైతుల బ్యాంకు ఖాతాలను కేంద్రాలవారీగా అందించాలి. రైస్‌ మిల్లర్లు కూడా సహకరించాల్సి ఉంది.

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM