గుడివాడ క్యాసినో తలపించేలా..
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:20 AM
అది బయటకు ఓ ఫంక్షన్ హాల్. కానీ, లోపల మాత్రం అంతా అడ్డగోలు వ్యవహారాలే. నిత్యం అక్కడికి కార్లు, ద్విచక్ర వాహనాల్లో బడాబాబులు వస్తుంటారు. గదులు అద్దెకు తీసుకుని గుడివాడ క్యాసినో తలపించేలా లక్షల రూపాయలు పెట్టి పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటారు. లోపల వారికి రాచమర్యాదలు. మందు, విందుతో పాటు సకల సౌకర్యాలు ఉంటాయి.
- విజయనగరంలో పేకాట డెన్
- వైసీపీ నేత అల్లుడి ఫంక్షన్ హాల్లో శిబిరం
- అందరూ బడాబాబులే
- లోపల సకల సౌకర్యాలు
అది బయటకు ఓ ఫంక్షన్ హాల్. కానీ, లోపల మాత్రం అంతా అడ్డగోలు వ్యవహారాలే. నిత్యం అక్కడికి కార్లు, ద్విచక్ర వాహనాల్లో బడాబాబులు వస్తుంటారు. గదులు అద్దెకు తీసుకుని గుడివాడ క్యాసినో తలపించేలా లక్షల రూపాయలు పెట్టి పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటారు. లోపల వారికి రాచమర్యాదలు. మందు, విందుతో పాటు సకల సౌకర్యాలు ఉంటాయి. ఈ ఫంక్షన్ హాల్.. ఓ వైసీపీ కీలక నేత అల్లుడికి చెందినది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇటువైపు వచ్చేందుకు పోలీసులు సాహసించేవారు కాదు. అయితే, ప్రభుత్వం మారడంతో వారి ఇల్లీగల్ బిజినెస్ బయట ప్రపంచానికి తెలిసింది.
విజయనగరం నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గతంలో ఎన్నడూ లేని కొత్త పోకడలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం నడిబొడ్డున పేకాట డెన్ నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 42 మంది విజయనగరంలో పేకాడుతూ గురువారం రాత్రి పట్టుబడడం జిల్లాలో సంచలనం సృష్టించింది. గుడివాడ క్యాసినో తరహాలో ఇక్కడ పేకాట శిబిరం కొనసాగుతుండడంతో నగరవాసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సూత్రధారి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత అల్లుడిగా తెలుస్తోంది. గతంలో విజయనగరాన్ని అడ్డాగా చేసుకొని అడ్డగోలు వ్యవహరాలు నడిపిన సదరు అల్లుడు.. రాష్ట్రస్థాయిలో సైతం విజయనగరాన్ని కేంద్రంగా చేసుకొని పేకాట నడిపినట్టు అర్ధమవుతోంది. పేకాటరాయుళ్లు పట్టుబడిన సుజాత ఫంక్షన్ హాల్ వైసీపీ నేత అల్లుడిదే. పూసపాటిరేగకు చెందిన కాకర్లపూడి కృష్ణమూర్తిరాజు పేరిట బుక్ చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒకేసారి దాడి చేయడంతో పేకాటరాయుళ్లకు తప్పించుకోవడానికి మార్గం లేకుండా పోయింది. పోలీసుల దాడిలో విజయనగరం జిల్లాకు చెందిన 15 మంది, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరుగురు, అనకాపల్లికి చెందిన 11 మంది, విశాఖకు చెందిన 9 మంది, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఒక్కరు పట్టుబడ్డారు. అయితే వారు వాడిన వాహనాలు, ఒంటిపై బంగారు ఆభరణాలు చూస్తుంటే వారంతా బడాబాబులుగా తెలుస్తోంది. సుజాత ఫంక్షన్‌లో ఒక్కపేకాటే కాదు, మద్యం, ఇతర సకల సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం. వాస్తవానికి గత కొన్ని నెలలుగా అక్కడ పేకాట శిబిరం నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో, వైసీపీ అధికారంలో ఉండడం, మామ పదవిలో ఉండడంతో ‘అల్లుడు గిల్లుడు’ సాగిపోయింది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచిపోయిందనే విమర్శలు బాహాటాంగానే వినిపిస్తున్నాయి. ఒక్కో ఆట (రౌండ్‌కు) వేలాది రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు విశ్వనీయ సమచారం. రోజు అక్కడికి పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు రాక పోకలు సాగించటంతో స్థానికులకు అనుమానం కలిగింది. ఎటువంటి శుభకార్యాలు లేకపోయినా ఫంక్షన్ హాల్‌కు అదే పనిగా పురుషులు రావడంతో వారి అనుమానం బలపడింది. కొంతమంది ఫుల్‌గా మద్యం తాగి వచ్చి వెళ్లేవారని, పెద్ద పెద్ద కేకలు వేస్తూ, కార్లలో సౌండ్ పెట్టి ఇబ్బందికి గురిచేసేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇదంతా పోలీసులకు తెలియకుండా జరుగుతుందా.? మనకు ఎందుకులే అని కొందరు అనుకున్నారు. ఎలాగోలా.. ! పోలీసులకు ఉప్పు అందింది. దీంతో గురువారం రైడ్ చేసి పట్టుకుని పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు.
ఎవరు పట్టించారు?
పేకాట శిబిరంపై గురువారం రైడ్ చేస్తే శుక్రవారం వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా, ఫంక్షన్ హాల్ యజమాని అయిన వైసీపీ నేత అల్లుడి పేరు ఎక్కడా పోలీసులు బయట పెట్టలేదు. ఇటీవల ఆ నేత జనసేనలో చేరుతారని ప్రచారం నడిచింది. వైపీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీలో అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అల్లుడికి చెందిన ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి జరగడంతో ఆ నేత తలపట్టుకున్నట్లు తెలుస్తుంది. దీని వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారా? లేదంటే రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది?
ఏదైనా వసతి కోసం హోటల్, చిన్న లాడ్జికి ఎవరైనా వెళ్తే వారి పూర్తి వివరాలు, ఆధార్, ఫోన్ నెంబర్లు, అడ్రస్ తీసుకొని గదులు అద్దెకు ఇస్తారు. అలాంటిది ఇంతపెద్ద నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌ని అద్దెకు ఇవ్వాలంటే సంబంధిత వ్యక్తుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. డబ్బులు ఇస్తే చాలు ఎవరికైనా గదులు అద్దెకు ఇచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉగ్రవాదులు, నక్సల్స్, దేశ విద్రోహులు వచ్చి గదులు అద్దెకు అడిగితే ఇచ్చేస్తారా? డబ్బుకోసం ఇంతటి నీచానికి దిగిపోవాలా? అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. పక్కనే ఉన్న విశాఖలో పోర్ట్‌తో పాటు హెచ్‌పీసీఎల్, నావీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలోని భోగాపురంలో ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్నాయి. ఇలా ఎవరికి పడితే వారికి అద్దెకు ఇస్తే జరిగే పర్యావసనాలకు బాధ్యులు ఎవరు. గత కొన్ని రోజులుగా పేకాట శిబిరాల నిర్వహిస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది కిందిస్థాయి పోలీసు సిబ్బందికి తెలిసే ఇదంతా జరుగుతుందని, నిర్వాహకుల ప్రలోభాలకు తలొగ్గి విషయం దాచివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.