Share News

ఇసుక కోసం రోడ్డేశారు!

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:52 PM

భామిని మండలం వంశధార నదీ తీరం నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇందుకోసం ఇసుకాసురులు ఏకంగా రోడ్లనే నిర్మించారు. నదీ తీరం వరకూ వాహనాలు వెళ్లేందుకు ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇసుక కోసం  రోడ్డేశారు!
నేరడి నదీ తీరానికి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు ఇలా...

వంశధార నదీతీరం వరకు రహదారుల ఏర్పాటు

ఒడిశా బిల్లులతో తవ్వకాలు, అక్రమ రవాణా

భామిని: భామిని మండలం వంశధార నదీ తీరం నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇందుకోసం ఇసుకాసురులు ఏకంగా రోడ్లనే నిర్మించారు. నదీ తీరం వరకూ వాహనాలు వెళ్లేందుకు ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు అలికాం-బత్తిలి రోడ్డు నుంచి పసుకుడి, బిల్లుమడ, నేరడి వరకు రహదారులు నిర్మించారు. కాగా దీనిపై స్థానిక ప్రజ్రాపతినిధులు, అఽధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా మండలంలోని కాట్రగడ వరద కాలువలో సేకరించిన ఇసుక మినహాయిస్తే తవ్వకాలకు ఇంకా ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వలేదు. అయితే కొందరు అక్రమార్కులు మాత్రం ఒడిశా బిల్లులతో ఆంధ్రా వైపు ఉన్న నదీ తీరం నుంచి యథేచ్ఛగా తవ్వకాలు జరిపి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ దందా కొనసాగిస్తున్నారు. దీని వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఉచిత ఇసుక విధానం పక్కాగా అమలు చేయాలని మరోవైపు ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. ఇసుక మాఫియాకు అదేమీ పట్టడం లేదు. ర్యాంపులకు ఎటువంటి అనుమతులు ఇవ్వకముందే.. బరి తెగించి వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. దీనిపై ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఎన్‌.రాజశేఖరంను వివరణ కోరగా.. ‘ఇసుక తవ్వకాలకు సంబంధించి తామెవరికీ అనుమతులు ఇవ్వలేదు. ఒడిశా అనుమతుల గురించి తనకు తెలియదు. నేరడి, పసుకుడిలో ర్యాంపుల ఏర్పాటు కోసం మైన్స్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.’ అని ఆయన తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్‌

పార్వతీపురం రూరల్‌: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుకకు సంబంధించి బుకింగ్‌లు పెంచాలన్నారు. ప్రభుత్వ పనులకు ఇండెంట్‌ పెట్టాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా రవాణా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. నేరడి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, మైనింగ్‌, రవాణా శాఖ, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:52 PM