Share News

శిలాఫలకాలతోనే సరి..

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:16 AM

జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాయకులు ఎంతో హడావుడిగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. అయితే పనులు మాత్రం పూర్తి చేయించలేకపోయారు. నాటి సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చివరకు శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

 శిలాఫలకాలతోనే సరి..
పార్వతీపురంలో ఆవిష్కరించిన శిలాఫలకం ఇలా..

హడావుడిగా శంకుస్థాపనలు చేసిన నాటి పాలకులు

సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిన పనులు

ప్రస్తుతం పెరిగిన అంచనా వ్యయం.. ప్ర‘జల’కు తప్పని కష్టాలు

పార్వతీపురం, నవంబరు23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాయకులు ఎంతో హడావుడిగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. అయితే పనులు మాత్రం పూర్తి చేయించలేకపోయారు. నాటి సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. చివరకు శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి 2018లో ఈ నిధులను అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇంతలోనే ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టడంతో ఆ పనులు త్వరితిగతిన పూర్తవుతాయని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. నేటికీ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని సాలూరు, పార్వతీపురం , పాలకొండలో పరిస్థితిని పరిశీలిస్తే..

ఇదీ పరిస్థితి..

- జిల్లా కేంద్రం పార్వతీపురంలో ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత వైసీపీ పాలకులు 2022, సెప్టెంబరు 14న మున్సిపల్‌ కార్యాలయానికి సమీపంలోనే శిలాఫలకం ఆవిష్కరించారు. ఏఐఐబీ సహకారంతో సుమారు రూ.63.63 కోట్లతో మెగా రక్షిత నీటి పథకం పనులు చేపడుతున్నట్టు గొప్పలు చెప్పారు. ప్రజల దాహార్తిని పూర్తిస్థాయిలో తీరుస్తున్న ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని వైసీపీ నాయకులు ప్రసంగించారు. అయితే పనులు మాత్రం పూర్తి చేయించలేక పోయారు. కాగా ఈ నిధులపై ఏ అధికారి కూడా స్పష్టత ఇవ్వడం లేదు.

- సాలూరులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అప్పట్లో రూ.68.98 కోట్లు మంజూరైంది. అయితే పనులు మాత్రం పూర్తవ్వలేదు. పాచిపెంట మండలం పెద్దగెడ్డ ప్రాజెక్టు నుంచి పట్టణానికి నీటిని మళ్లించాలని భావించారు. ఈ మేరకు 2022, సెప్టెంబరు 10న, స్థానిక మున్సిపల్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో వైసీపీ నాయకులు హడావుడిగా శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

- పాలకొండలో రక్షిత నీటి పథకం ఏర్పాటు, పైప్‌లైన్ల విస్తరణకు గతంలో రూ.57 కోట్లు మంజూరైంది. అయితే గత ప్రభుత్వ హయాంలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులు మాత్రమే చేపట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లు వెచ్చించినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక రక్షితనీటి పథకం పనులైతే ప్రారంభానికి నోచుకోలేదు.

పెరిగిన అంచనా వ్యయం

పార్వతీపురం, సాలూరు, పాలకొండలో తాగునీటి సమస్యను పరిష్కారం కోసం సుమారు రూ.180 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తికాకపోవడంతో 40 శాతం మేర అంచనా వ్యయం పెరిగింది. అధికారులు ప్రతిపాదనలు పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రతిపాదనలకు మోక్షం లభిస్తే పనులు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్ర‘జల’ కష్టాలు తీరనున్నాయి.

అన్ని కాలాల్లోనూ ఇబ్బందులే..

జిల్లాకేంద్రం పార్వతీపురంలో ప్రజలకు అన్ని కాలాల్లోనూ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో మూడు, నాలుగు రోజులకొకసారి నీటి సరఫరా జరగ్గా, వర్షాకాలంలో అయితే కొళాయిల ద్వారా బురదనీరు సరఫరా అవుతుంది. శివారు ప్రాంతాలకు ట్యాంకర్లే గతి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమేరకు సమస్యను పరిష్కరించినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులన్నీ నిలిచిపోయాయి. పార్వతీపురం, సాలూరు, పాలకొండలోనూ ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి రానున్న వేసవిలోగా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తాం..

పార్వతీపురం, సాలూరు, పాలకొండలో తాగునీటి సమస్య పరిష్కారానికి అప్పట్లో రూ.180 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించి రివైజ్డ్‌ అంచనాలు తయారు చేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తాం.

- పి.వంశీకృష్ణ, జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ అధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 24 , 2024 | 12:16 AM