అన్నదాతను వేధిస్తున్న కూలీల కొరత
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:42 PM
జిల్లాలో రైతులకు కూలీల సమస్య వెంటాడుతుంది. దీంతో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి వరి కోతలు మొదలైనప్పటికీ.. కూలీల కొరత నేపథ్యంలో అన్నదాతలకు ఖరీఫ్ ఖర్చులు తడిసిమోపెడవు తున్నాయి.
అయినా సకాలంలో ముందుకు సాగని వ్యవసాయ పనులు
రాయితీపై సాగు పరికరాలు అందించని గత వైసీపీ ప్రభుత్వం
ఇబ్బందుల్లో రైతులు
పాలకొండ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు కూలీల సమస్య వెంటాడుతుంది. దీంతో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి వరి కోతలు మొదలైనప్పటికీ.. కూలీల కొరత నేపథ్యంలో అన్నదాతలకు ఖరీఫ్ ఖర్చులు తడిసిమోపెడవు తున్నాయి. వాస్తవంగా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ కింద సుమారు 1.68 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేపట్టారు. పత్తి, మొక్కజొన్న, అరటి తదితర పంటలు సుమారు 50 వేల ఎకరాల్లో సాగు అవుతున్నాయి. కాగా ఇప్పుడిప్పుడే వరికోతలు ముమ్మరం చేసిన రైతులు పంటను కల్లాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కూలీల కొరతతో తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
వలసల జిల్లాగా పేరొందిన ‘మన్యం’లో కూలీలు రోజూ పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. మరికొందరు పట్టణాలు, నగరాల్లో నెలవారి వేతనదారులుగా, భవన నిర్మాణ కార్మికులుగా, పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. దీంతో కూలీల సమస్య జఠిలమవుతుంది. కాగా ప్రస్తుతం వారికున్న డిమాండ్ దృష్ట్యా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్న కూలీలను కాంట్రాక్ట్ పద్ధతిపై కల్లాలకు తరలిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వారితో ఒప్పందాలు కుదుర్చుకొని పనులు చేయిస్తున్నారు. కాగా నిన్న మొన్నటి వరకు ఎకరం కోతకు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.4,500 నుంచి రూ.6 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. కోత కోసిన వరి పంటను ఓదులు చుట్టేందుకు ఎకరాకు గతంలో రూ.800 నుంచి రూ. 1000 ఉండగా, ప్రస్తుతం రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు అడుగుతున్నారు. ఓదులను కళ్లాలకు తరలించి కప్పలు వేసేందుకు ఇప్పటివరకు దూరం బట్టి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు ఉండగా ప్రస్తుతం రూ.5 వేలు నుంచి రూ.6 వేలు వరకు వసూలు చేస్తున్నారు. పంటను ట్రాక్టర్ల , వరి యంత్రాల ద్వారా నూర్పు వేసేందుకు ఎకరాలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు వరకు తీసుకోగా, ఈ ఏడాది రూ.4 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా విత్తనాలు కొనుగోలు మొదలు తిరిగి పంట దక్కేవరకు ఎకరాకు సరాసరి రైతుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు వరకు ఖర్చు అవుతుంది. దిగుబడి మాత్రం 25 నుంచి 28 బస్తాలకు మించి రావడం లేదు. మరోవైపు కూలీల ఖర్చలు తోడవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో..
గత వైసీపీ ప్రభుత్వం రైతులను వ్యవసాయ యంత్ర పరికరాలకు దూరం చేసింది. సబ్సిడీ ధరలకు వరికోత యంత్రాలు, నూర్పుడి మిషన్లను అందించకపోడంతో జిల్లాలో రైతులు కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది. కూలీల కొరతను అధిగమించేందుకు ఇప్పుడిప్పుడే రైతులు యంత్రాల వినియోగంపై మొగ్గు చూపుతున్నా.. పూర్తిస్థాయిలో అవి అందుబాటులో లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై నూర్పు, వరి కోత యంత్రాలను అందించారు. దీంతో అన్నదా తలకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
యంత్ర పరికరాల పంపిణీకి చర్యలు
జిల్లాలో రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అన్నదాతల వినతుల మేరకు సాగు పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తాం.
- రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయాధికారి, పార్వతీపురం మన్యం