Share News

నైపుణ్యాలు.. విజయదీపికలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:06 AM

జిల్లాలోని చాలామంది విద్యార్థులు విశాల్‌ లాంటి పరి స్థితినే ఎదుర్కొంటున్నారు. చదువులో ముందున్నా, పరీక్షల్లో మార్కులు బాగా సాధించి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా ఉద్యోగ సాధనలో మాత్రం విఫలమవుతున్నారు.

నైపుణ్యాలు.. విజయదీపికలు

- కచ్ఛితంగా పాటిస్తే విజయం మీదే

- మార్కులే గీటు రాయి కాదు

- సాఫ్ట్‌ స్కిల్స్‌కే ప్రాధాన్యత

- వ్యక్తిత్వ వికాసం కీలకం

- చీపురుపల్లికి చెందిన విశాల్‌ అనే యువకుడు ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యనభ్యసించాడు. చదువులో బాగా రాణించి ఇంజనీరింగ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాడు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉండేవాడు. తన మిత్రులు కూడా పదే పదే అదే మాట అనేవారు. ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికలకు సంబంధించి తుది జాబితాలో విశాల్‌ పేరు కనిపించలేదు.

- చీపురుపల్లికి చెందిన మరో ఇంజనీరింగ్‌ విద్యార్థి అనుదీప్‌ చదువుతో పాటు పాఠ్యే తర అంశాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇతను ప్రాంగణ నియామకాల్లో ఎంపిక య్యాడు. ఇంజనీరింగ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు కూడా పొందలేని ఉద్యోగాన్ని ఒడిసి పట్టాడు. అతని విజయానికి కారణం సాఫ్ట్‌స్కిల్స్‌.

చీపురుపల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని చాలామంది విద్యార్థులు విశాల్‌ లాంటి పరి స్థితినే ఎదుర్కొంటున్నారు. చదువులో ముందున్నా, పరీక్షల్లో మార్కులు బాగా సాధించి మంచి ర్యాంకులు తెచ్చుకున్నా ఉద్యోగ సాధనలో మాత్రం విఫలమవుతున్నారు. విషయ పరిజ్ఞానం ఉన్నా, చేరాలనుకున్న లక్ష్యాలకు ఆమడ దూరం లో ఆగిపోతున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు ముఖ్యంగా సాఫ్ట్‌ స్కిల్స్‌ ప్రాధాన్యాన్ని గుర్తించా లి. అపారమైన తెలివి తేటలు ఉన్నా సాఫ్ట్‌స్కిల్స్‌ లేకపోతే అవన్నీ నిరుపయోగమే. కాలంతో పాటు సాంకేతిక ప్రపం చంలో వస్తున్న మార్పులను స్వీకరించడాన్ని సాఫ్ట్‌స్కిల్స్‌గా పేర్కొంటున్నారు. బృంద సభ్యుడిగా రాణించడం, సంభా షణ, సమస్యలను సొంతంగా పరిష్కరించుకోగలడం, సమయపాలన, నాయకత్వ లక్షణాలు ఉంటే విజయానికి చిరునామాగా మారొచ్చు. విషయ పరిజ్ఙానం, విద్యలో ఉత్తమ ప్రతిభ కలిగి ఉన్నా, అనేక మంది ఉద్యోగాల సాధనలో వెనుకబడిపోతున్నారు. లెక్కలు, సైన్సులో ఎన్ని సూత్రాలు, ఈక్వేషన్లు తెలిసినా, అపారమైన తెలివితేటలు ఉన్నా అవి ఉపాధికి ఉపయోగపడడం లేదు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌ ఉండాల్సిందే. ఉద్యోగార్ధుల నుంచి ఇలాంటి నైపుణ్యాన్నే నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. ఉద్యోగం పొంది అగ్రస్థానానికి చేరుకోవాలంటే ప్రధానంగా ఐదు నైపుణ్యాలు పెంచు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పంచతంత్రంతో విజేతలు కావచ్చునని సలహా ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

బృంద సభ్యుడిగా..

బృందంలో పనిచేస్తే ఇతరుల నుంచి చాలా విషయా లు తెలుసుకోవచ్చు. జట్టుగా ప్రాజెక్టులు చేయాల్సి వచ్చి నప్పుడు నేర్పు ముఖ్యం. మన తప్పులను సహచరులు తెలియజేస్తే వాటిని సరిచేసుకుని మరింత రాణించొచ్చు. సవాళ్లను స్వీకరించి సానుకూల దృక్పథంతో వ్యవహ రించాలి. ఎవరి సాయం లేకుండా చేయగలననే ధీమా పనికిరాదని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. ఉన్న త స్థానం చేరుకోవాలంటే పరస్పర సహకారం అవసరం. ఇది అలవాటవ్వాలంటే క్రీడలు, విద్యేతర అంశాల్లో ఎక్కువ గా పాల్గొనాలి. కళాశాల స్థాయిలోనే ఈ నైపుణ్యాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి.

భావ వ్యక్తీకరణ..

భావ వ్యక్తీకరణ విషయంలో నవ్యాంధ్ర యువత వెను కంజలో ఉందని ఇటీవల ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రశ్నలు అడగడంలోనూ, ఉత్సాహంగా వినడంలోనూ ఎదుటి వారి కళ్లలోకి సూటిగా చూసి మాట్లా డే విషయంలో విఫలమై ఉద్యోగాలకు ఎంపిక కాని వారు ఎందరో ఉన్నారు. ఎలకా్ట్రనిక్‌ విప్లవంతో ప్రపంచంలోని యు వత ఒక వేదికపైకి వస్తోందనే అపోహ రాజ్యమేలుతోంది. వీటి వల్ల ముఖాముఖి పరిచయాలు, టెలిఫోన్‌ సంభాషణ లు తగ్గిపోయాయి. దీంతో యువతలో వాక్చాతుర్యం తగ్గు తోంది. విద్యార్థులు, ప్రొఫెసర్లతో మంచి సంబంధాలు ఉంటే వారి నుంచి విలువైన సలహాలు, సూచనలు పొందవచ్చు. సంభాషణలు కొరవడడంతో ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు సాధించలేక పోతున్నారని నిపుణుల అభిప్రాయం. దీన్ని అధిగమించా లంటే భయం లేకుండా మాట్లాడాలి. సందేహాలు వస్తే వాటిని తీర్చుకోవాలి. ఇంటర్న్‌షిప్‌కు వెళ్తే భావవ్యక్తీకరణ నైపుణ్యం పెంచుకోవచ్చు.

సమస్యలను ఎదుర్కోవడం..

విద్యార్థులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల సాయంతో వాటిని అధిగమించవచ్చునని అనుకోకూడదు. ఇతరుల సాయం లేకుండా వాటిని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని సొంతంగా పెంపొందించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోలేని వారు, ఇతర అంశాలు తెలుసు కోలేనివారు ఇబ్బందులు పడతారు. ప్రతికూల పరిస్థితులను సైతం నూతన విధానాల ద్వారా సొంతంగా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉండాలి. తరచూ చర్చాగోష్ఠులు, సైన్స్‌ ఒలింపియాడ్‌లు, సదస్సుల్లో పాల్గొనాలి.

సమయ పాలన..

చిన్నప్పటి నుంచీ సమయపాలనను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నియమిత వ్యవధిలో జరిగే పరీక్ష ల్లో దీని విలువ అనంతం. విద్య, ఉద్యోగ దశల్లో అధ్యాప కులు, ఉన్నతాధికారులు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయడానికి సమయమనేది కీలకం. దీన్ని సమర్థంగా వినియోగించుకోడానికి, ప్రాధాన్యత ప్రకారం పనుల్ని పూర్తి చేయడానికి సమయపాలన అవసరం. ఒక్కోసారి ఏక కాలంలో అనేక ప్రాజెక్టులు నిర్వహించాల్సి వస్తుంది. ఇది ఓర్పు, సమయపాలనతోనే సాధ్యం. పాఠశాల, కళాశాలల స్థాయి నుంచే వివిధ బాధ్యతలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌, స్వచ్ఛంద సేవ, తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలి. అప్పుడే పనుల ప్రాధాన్యత క్రమం, వాటి నిర్వహణలో సమర్థత, అనుభవం వస్తుంది.

నాయకత్వ లక్షణం..

సభ్యుడిగానే కాకుండా కొన్ని సార్లు నాయకుడిగా ఉండా ల్సి రావచ్చు. దీన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండా లి. కళాశాలలు, పని చేసేచోట ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే నాయకత్వ లక్షణాలు పెంచుకోవా లి. నియామక సంస్థలు ఎప్పుడూ నాయకత్వ పటిమ ఉన్న వారి కోసం వెతుకుతాయి. వీటి కోసం విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ప్రయత్నించాలి. ఆటల్లో కెప్టెన్‌గా అవకాశం వస్తే వదులుకోకూడదు. విద్యార్థి సంఘాల కార్యక్రమాల్లో, పాఠ్యేతర అంశాల్లోనూ చురుగ్గా పాల్గొనాలి.

Updated Date - Nov 21 , 2024 | 12:06 AM