Share News

v

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:29 AM

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో మళ్లీ నేరాలకు పాల్పడతారన్న అనుమానం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

v
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

విజయనగరం క్రైం, నవంబరు 13: (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో మళ్లీ నేరాలకు పాల్పడతారన్న అనుమానం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. డాబాల్లో మద్యం సరఫరా చేయకుండా చూడాలన్నారు. మద్యం సరఫరా చేస్తే, వారిపె కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేకాట, కోడిపందేలు నిర్వహించకుండా ముందస్తు సమాచారం సేకరించి విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం నిర్వహించనున్న లోక్‌ఆదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికతో పని చేయాలన్నారు. మిస్సింగ్‌ కేసులో అలసత్వం వద్దని... కేసు నమోదైనే వెంటనే దర్యాప్తు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనుగొనాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టుబడిన వారిపై సస్పెక్టడ్‌ షీట్స్‌ ఓపెన్‌ చేయాలన్నారు. రాత్రి పూట గస్తీ, పెట్రోలింగు పటిష్టవంతంగా చేయాలన్నారు. రాత్రి 11 గంటల తరువాత అకారణంగా తిరిగే వారిని స్టేషన్‌కు తరలించి... కౌన్సిలింగ్‌ నిర్వహించి, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీలు సౌమ్యలత, జి .నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, రాఘవులు, వీరకుమార్‌, యూనివర్స్‌, న్యాయ సలహాదారు పరశురామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:29 AM