Share News

vizianagaram-police: విజయనగరంపై నిఘా

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:18 PM

vizianagaram-police: జిల్లా కేంద్రం విజయనగరంపై పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం టూటౌన్‌ పరిధిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

vizianagaram-police: విజయనగరంపై నిఘా
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ వకూల్‌ జిందాల్‌

- 40 సీసీ కెమెరాలు అనుసంధానం

- మరో 20 అమర్చేందుకు ప్రణాళిక

విజయనగరం క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం విజయనగరంపై పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం టూటౌన్‌ పరిధిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాల్లో 40 కెమెరాలను అమర్చి కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. శివారు ప్రాంతాల్లో మరో 20 కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 60 కెమెరాలతో విజయనగరంపై నిఘా పెట్టనున్నారు. దీంతో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా, క్షణాల్లో సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోతుంది. వెంటనే పోలీసులు అక్కడ ప్రత్యక్షమవుతారు.


పెరుగుతున్న నగరం

విజయనగరం క్రమేపీ విస్తరిస్తోంది. కాలనీలు, అపార్టుమెంట్లు పెరుగుతున్నాయి. నగరానికి అనుకుని ఉన్న పంట పొలాలు సైతం లే అవుట్లుగా మారి కొత్త, కొత్తకాలనీలుగా ఆవిర్భవిస్తోన్నాయి. దీంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. గంజాయి, మత్తు పదార్థాల రవాణాకు అడ్డాగా మారుతోంది. ఈ నేరాలను నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ సీసీ కెమెరాలతో నిఘా పెడుతోంది. విజయనగరంలోని ప్రస్తుతం ఉన్న వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్లకు అదనంగా త్రీ టౌన్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉన్నా, అది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో నేరాల నియంత్రణ పోలీసులకు కొంత కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న కొత్తపేట, సాకేటివీధి, బంగారమ్మపేట, స్వీపరువీధి, పూల్‌బాగ్‌ కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, సిద్ధివినాయక నగర్‌, హనుమాన్‌ నగర్‌, మారుతీ ధ్యానమందిరం రోడ్డు, నందిగుడ్డి, పూల్‌బాగ్‌ బిట్‌-2, బాబామెట్ట, దాసన్నపేట, లంకాపట్టణం, వైఎస్సార్‌ నగర్‌, మెడికల్‌ కళాశాల రోడ్డు, పుచ్చలవీధి, అద్దెపల్లెవారు వీధి, పల్లెవీధి, మూడులాంతర్లు, పార్కుగేటు, గాజులరేగ, తదితర ప్రాంతాల్లో 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసి నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మరో 20 కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.


నేరాలు తగ్గుముఖం పడతాయి: ఎస్పీ

విజయనగరం టూటౌన్‌ పరిఽధిలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పడతాయని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. శుక్రవారం టూటౌన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాధారణంగా జిల్లా లేదా సబ్‌ డివిజన్‌ స్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ ఉంటుందన్నారు. కానీ, ఒక పోలీసు స్టేషన్‌ పరిధిలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీఐ శ్రీనివాసరావు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే 15 రోజుల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు శ్రీనివాసరావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి, బి.లక్ష్మణరావు, ఎస్‌ఐలు మురళీ, కృష్ణమూర్తి, ఏఎస్‌ఐ పైడితల్లి, అర్జున్‌, పోలీసు సిబ్బంది సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:18 PM