విద్యా సంస్థల్లో తాగునీటి పరీక్షలు
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:36 PM
జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి పరీక్షలు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, నవంబరు19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి పరీక్షలు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహితంగా మారాలని సూచించారు. 122 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెప్టిక్ ట్యాంకులు మరమ్మతులు చేయాలని తెలిపారు.
మరుగుదొడ్లను ఉపయోగించాలి
ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. మరుగుదొడ్ల దినం సందర్భంగా మంగళవారం కొమరాడ మండలం విక్రంపురంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన సామాజిక దూరాచారమన్నారు. గ్రామదర్శినిలో భాగంగా ప్రత్యేక అధికారులు మరుగుదొడ్లుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు మంజూరైన లేఖలను లబ్ధిదారులకు అందించారు. ఆ తర్వాత వాటి వినియోగంపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు.