Share News

‘బడిదేవరమ్మ’ను ఆ దేవరే కాపాడాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:58 PM

పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో ఉన్న బడి దేవరమ్మ కొండపై గ్రానైట్‌ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతం పూర్తిగా రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిందని, గతంలో అటవీశాఖ అధికారులు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించారు.

 ‘బడిదేవరమ్మ’ను ఆ దేవరే కాపాడాలి
బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్న దృశ్యం

- కొండపై యథేచ్ఛగా గ్రానైట్‌ తవ్వకాలు

- అటవీశాఖ అధికారులు మౌనం

- పాలకులు కూడా నోరుమెదపట్లే!

- రికార్డులు మార్చేశారా?

పార్వతీపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో ఉన్న బడి దేవరమ్మ కొండపై గ్రానైట్‌ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతం పూర్తిగా రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిందని, గతంలో అటవీశాఖ అధికారులు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించారు. అలాంటి చోట ఇప్పుడు గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నా ప్రస్తుత అటవీశాఖ అధికారులు మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా స్వపక్ష, విపక్ష నాయకులు కూడా ఈ వ్యవహారంపై నోరుమెదపడం లేదు. ‘మీ ప్రభుత్వం అనుమతిచ్చిదంటే, కాదు.. మీ ప్రభుత్వం అనుమతిచ్చిదంటూ’ ఒకరినొకరు ఆడిపోసుకుంటున్నారే తప్పా కొండపై తవ్వకాలను మాత్రం అడ్డుకోవడం లేదు. దీంతో రికార్డులు మార్చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇదీ పరిస్థితి..

పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో, ములగ రెవెన్యూ పరిధిలోనూ గ్రానైట్‌ కొండలు ఉన్నాయి. కోరి రెవెన్యూ పరిధిలో ఉన్న కొండపై బడిదేవరమ్మ కొలువై ఉందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. నిత్యం బడిదేవరమ్మను ఆరాధిస్తుంటారు. అయితే, ఈ కొండపై కొందరు గ్రానైట్‌ వ్యాపారుల కన్నుపడింది. సర్వే నెంబర్‌-1లోని బడిదేవరమ్మ కొండపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయాలని 2014లో దరఖాస్తు చేశారు. దీంతో రెవెన్యూశాఖ సిఫారసు మేరకు 16.76 ఎకరాల్లో గ్రానైట్‌ తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. తవ్వకాలకు అనుమతులిచ్చిన ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. మూడు శాఖల వాదనలు జరుగుతున్న సమయంలోనే.. కొంతమంది స్థానికులు హైకోర్టులో ప్రైవేటు పిటీషన్‌ దాఖలు చేశారు. అప్పటి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉన్నతాధికారులతో కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో సర్వే చేయించారు. ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోనే ఉందని తేల్చి.. హైకోర్టు, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి నివేదికలు అందించారు. దీంతో హైకోర్టు గ్రానైట్‌ తవ్వకాల అనుమతులు రద్దు చేసింది.


కాపాడేదెవరో?

బడిదేవర కొండను కాపాడేదెవరో తెలియని పరిస్థితి తాజాగా నెలకొంది. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ కొండపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తే అప్పట్లో వైసీపీ నాయకులు వ్యతిరేకించారు. కొంతవరకు గ్రానైట్‌ తవ్వకాలు జరగకుండా అడ్డుకున్నారు. అప్పట్లో అటవీశాఖాధికారులు కూడా పూర్తిస్థాయిలో వాస్తవాలను రాష్ట్రస్థాయి కమిటీలకు తెలియజేసి సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలకు అవసరమైన అనుమతులను మంజూరు చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనలు చేశారు. గ్రానైట్‌ తవ్వకాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలా ఎవరికి వారే ఆందోళనలు చేసినా కొండపై మాత్రం తవ్వకాలను ఆపలేకపోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రానైట్‌ తవ్వకాలు రద్దవుతాయని ఈ ప్రాంత ప్రజలు భావించి పండగ చేసుకున్నారు. కానీ, ఆ పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై పోరాడాల్సిన వైసీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదు. మరోపక్క న్యాయస్థానం పేరు చెప్పి అటవీశాఖాధికారులు కూడా మౌనంగా ఉన్నారు. దీంతో బడిదేవరతల్లిని ఎవరు రక్షిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. బడి దేవరమ్మ దేవత నిలయంగా ఉన్న బడి దేవరమ్మ కొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


పోరాటానికి సన్నద్ధం.

బడిదేవర కొండపై జరుగుతున్న గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయా లని డిమాండ్‌ చేస్తూ సీపీఎం, సీపీఐ, జనసేన తదితర పార్టీలతో పాటు కొన్ని సంఘాలు పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. అయితే, వీరి పోరాటాన్ని నీరుగార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇటీవల కొందరు స్థానికులతో కలసి కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో తమకు ఉపాధి దొరుకుతుందంటూ వారు ఆందోళన చేయడం వెనుక కొందరి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

ఉద్యమం తీవ్రతరం చేస్తాం

బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా తవ్వకాలు చేపట్టడం తగదు. ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవం వద్ద గ్రానైట్‌ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.

-బడిదేవరకొండ గ్రానైట్‌ తవ్వకాల పోరాట కమిటీ

Updated Date - Oct 23 , 2024 | 11:58 PM