Share News

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:40 AM

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం పాలకొండ నియోజకవర్గం కొండాపురంలో రెవెన్యూ సదస్సును ప్రారంభించారు.

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం/పాలకొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం పాలకొండ నియోజకవర్గం కొండాపురంలో రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో భూదందాలు జరిగాయన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా అప్పట్లో బాధితులు భయపడే వారని తెలిపారు. రైతులకు చెందిన పాస్‌ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్‌ ఫొటో ముద్రించుకుని దారుణమైన తప్పిదం చేశారని ఆరోపించారు. సర్వే రాళ్లపై కూడా జగన్‌ ఫొటో కనిపించే విధంగా చేశారని ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. ‘మీ భూమి..మీ హక్కు’ అనే నినాదంతో ఈ నెల 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు తమ సమస్యలను నేరుగా సదస్సు దృష్టికి తీసుకురావొచ్చన్నారు. ఇకపై అన్నదాతలకు ప్రభుత్వ లోగోతో పాస్‌ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. డీ పట్టా సమస్యలు వివాదాలకు ప్రధానమైనవని.. వీటిని పరిష్కరించడంలో అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. సదస్సులు, కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులపై దృష్టిసారించాలని సూచించారు. ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని తెలిపారు. కూర్మసాగరం, జంపరకోట ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. ఇది రైతు ప్రభుత్వమని వెల్లడించారు. శనివారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్‌ మీటింగ్‌కు తల్లిదండ్రులు హాజరుకావాలన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణానికి రూ.20 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉందని, డంపింగ్‌యార్డుతో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో భూ సమస్యలపై దాదాపు 50 నుంచి 60 శాతం ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పారిశుధ్యంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని ప్రజలకు సూచించారు. అనంతరం సదస్సులో పలువురికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఎస్‌.మన్మఽథ రావు, అర్బన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సాల్మన్‌రాజు, తహసీల్దార్‌ బాలమురళీకృష్ణ, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

డోలీ మోతలు ఉండకూడదు

సీతంపేట రూరల్‌: ఏజెన్సీ ప్రాంతంలో డోలీ మోతలు ఉండకూడదని మంత్రి సంధ్యారాణి తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని సెక్టోరియల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. .నిధులకు డోకా లేదని మారుమూల గిరిజన గ్రామాల్లో పక్కా రహదారులు నిర్మించాలని సూచించారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. త్వరలో అంబులెన్స్‌, ఫీడర్‌ అంబులెన్స్‌ వాహనాలను ఐటీడీఏకు కేటాయిస్తామని తెలిపారు. వీడీవీకేలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను మంత్రి అభినందించారు. గిరిజన విద్యార్థులను అధికారులు, పాఠశాలల వార్డెన్‌, ఉపాధ్యాయులు సొంత బిడ్డల్లా చూడాలన్నారు. మెనూ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల పై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ఫిర్యాదులు బాక్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

మిగిలిన చోట్ల..

సీతానగరం మండలం రేపటివలసలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, గుమ్మలక్ష్మీపురం మండలం మొలిగూడ గ్రామంలో ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. జిల్లాలో మిగిలిన చోట్ల జరిగిన సదస్సులో జేసీ శోభిక, డీఆర్వో హేమలత, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు.. 462 ఫిర్యాదులు

జిల్లాలో మొదటి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు 503 మంది నుంచి 462 ఫిర్యాదులు అందాయి. 22ఏకు నాలుగు, వెబ్‌ల్యాండ్‌ కరెక్షన్‌ కోసం 72, మ్యుటేషన్‌ 282 , ఇతర సమస్యలకు సంబంధించి 104 అర్జీలను అధికారులు స్వీకరించారు.

Updated Date - Dec 07 , 2024 | 12:40 AM