Share News

discounts బంపర్‌...ఆఫర్‌!

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:25 AM

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. రెండు కొంటే మూడోది ఫ్రీ. పండుగ క్ల్లియరెన్స్‌ సేల్‌. భారీ ఆఫర్లు.. కళ్లు చెదిరే రాయితీలు.. విజయనగరంలో ఏ మూల చూసినా ఇవే ప్రకటనలు. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఇదే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

discounts  బంపర్‌...ఆఫర్‌!

సాధారణంగా సంక్రాంతి సందడి జనవరి మొదటి వారం నుంచి మొదలవుతుంది. కానీ వ్యాపారులకు మాత్రం ఓ నెల ముందే ప్రారంభమవుతుంది. క్రిస్మస్‌ కొనుగోళ్లు డిసెంబరులో ప్రారంభమవుతాయి. దీంతో వస్తు, వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ముఖ్యంగా వివిధ వ్యాపార సంస్థలు ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఉచితం అంటూ ఊరిస్తారు. దీనికి ఉండే ఆకర్షణ శక్తీ అలాంటిదే. అందుకే జనం అటువైపు చూస్తుంటారు. ఆఫర్లతో పాటు నాణ్యతనూ గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.

  • మార్కెట్‌లో డిస్కౌంట్ల సందడి

  • కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న వ్యాపారులు

  • ఇప్పటికే మొదలైన పండగ వ్యాపారం

  • నాణ్యతను చూడాలంటున నిపుణులు

విజయనగరం/ గజపతినగరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. రెండు కొంటే మూడోది ఫ్రీ. పండుగ క్ల్లియరెన్స్‌ సేల్‌. భారీ ఆఫర్లు.. కళ్లు చెదిరే రాయితీలు.. విజయనగరంలో ఏ మూల చూసినా ఇవే ప్రకటనలు. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఇదే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇవి సాధారణ, మధ్య తరగతి వారితో పాటు ఉన్నత వర్గాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆఫర్ల గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. ఎక్కడ తమకు అనుకూలంగా ఉంటున్నాయో నిర్ణయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి.

అతి పెద్ద మార్కెట్‌..

ఉత్తరాంధ్రలో అతిపెద్ద వస్త్ర వ్యాపార కేంద్రం విజయనగరం. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వ్యాపారం కూడా విజయనగరంతోనే ముడిపడి ఉంది. ఉల్లి వీధి, రైల్వేస్టేషన్‌ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు, బాలజీ జంక్షన్‌ నుంచి మార్కెట్‌ వరకూ వందలాది వ్యాపార సంస్థల సమాహారం విజయనగరం. వివాహాలు, ఇతర శుభకార్యాల వస్త్రాలకు పెట్టింది పేరు. ఉత్తరాంధ్ర ప్రజల ఇంట్లో ఏ చిన్న కార్యక్రమమైనా షాపింగ్‌ కోసం ముందుగా ఎంచుకునేది విజయనగరాన్నే. క్రిస్మస్‌, సంక్రాంతి లాంటివ పండగలు వచ్చాయంటే చాలు.. ఇక్కడ మార్కెట్‌లో ఆఫర్లతో సందడి మొదలవుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు సంక్రాంతి పండగ అత్యంత ముఖ్యమైనది. దీంతో షాపింగ్‌ అదే స్థాయిలో జరుగుతుంది. వ్యాపారమూ అంతే స్థాయిలో ఉంటుంది.

భారీ స్థాయిలో వ్యాపారం

ఉత్తరాంధ్రులు ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో సంబంధ బాఽంధవ్యాలు కలిగి ఉంటారు. ఈ ప్రాంతీయులు ఎక్కువ ఆ రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. అటు నుంచి కూడా ఇక్కడికే కొనుగోలుకు వస్తుంటారు. దీంతో మూడు రాష్ట్రాలకూ వ్యాపార పరంగా విజయనగరం కేంద్రంగా మారింది. డిసెంబరు మొదటి వారం నుంచే ఇక్కడ మార్కెట్‌లో సందడి మొదలవుతుంది. సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. ఈ రెండు నెలల్లోనే విజయనగరం మార్కెట్‌లో రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ విక్రయాలు జరుగుతాయనేది ఒక అంచనా. జిల్లా వ్యాప్తంగా హోల్‌సేల్‌ దుకాణాలు 1000 వరకూ ఉండగా రిటైల్‌ షాపులు మరో 600 వరకూ ఉంటాయి. జ్యూయలరీ షాపులు 500 వరకూ ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరుగుతుంటుంది.

ఆఫర్‌ మంచిదే కానీ...

వస్త్రాలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను పండుగ సమయాల్లో తక్కువ ధరలు, ఆఫర్లతో విక్రయిస్తుంటారు. ఇవి సామాన్యులకు కొంత ఊరటనిచ్చేవేననడంలో సందేహం లేదు. అదే సమయంలో వీటి వెనుక చిన్నపాటి మాయాజాలమూ ఉంటోంది. ఆఫర్ల పేరుతో కొన్ని షాపుల యజమానులు నాసిరకం వస్త్రాలు, వస్తువులు అంటగడుతుంటారు. కొందరు చాలా కాలంగా షాపుల్లో ఎవరూ కొనుగోలు చేయకుండా వదిలేసిన వాటిని, కాలం చెల్లిన వాటిని విక్రయిస్తున్నారు. దీనిని గుర్తించలేని వినియోగదారులు మోసపోతున్నారు. ఆఫర్‌తో పాటు నాణ్యత కూడా అత్యవసరమని గుర్తించాలి. ఆఫర్‌పై ఆశతో నాణ్యతలేని వస్త్రాలు కొనుగోలు చేసి...ఇబ్బంది పడడకం కంటే...కాస్త భారమైనా అసలు ధర పెట్టి కొనుగోలు చేయడమే మేలన్న సంగతి గుర్తెరగాలి. వాస్తవానికి ఎమ్మార్పీ ధర రూ.2 వేలుగా చూపించి... దానిని రూ.వెయ్యికే విక్రయిస్తారు. దాని అసలు ధర రూ.వెయ్యి దాటి ఉండదనే విషయం తెలుసుకోవాలి. వ్యాపారి ఎవరైనా లాభం చూసుకునే రాయితీలు ప్రకటిస్తారు. సాధారణంగా రూ.100 లాభం వచ్చేచోట రూ.80 వచ్చేలా ఆఫర్‌ ఇస్తుంటామని, దీని వల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరుగుతుందని..తద్వారా ఆదాయం వస్తుందని ఓ వ్యాపారి చెప్పారు.

అసలు స్టిక్కర్లు ఉండవు..

వస్త్ర దుకాణాల్లో ఉత్పత్తి చేసిన కంపెనీలకు సంబంధించిన ఎంఆర్‌పీ స్టిక్కర్లు మాత్రమే ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని తీసివేసి... సొంత ఎంఆర్‌పీ స్టిక్కర్లను పెడుతున్నారు. ఇది నేరం కూడా. కొన్ని చోట్ల కిలోల వంతున దుస్తులు అమ్ముతున్నారు. అసలు దుస్తుల నాణ్యత ఎంత? దానికి దుకాణ యజమాని ఎంత రేటు కట్టి విక్రయిస్తున్నారు? తూకం సరిగా ఉందా లేదా? అన్న విషయంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టడం లేదు.

Updated Date - Dec 31 , 2024 | 12:26 AM