Share News

చిన్నవి సరే.. పెద్దవి పూడ్చేదెప్పుడు?

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:38 PM

పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దారుణంగా తయారైంది. అడుగడుగునా భారీ గోతులు ఏర్పడడంతో పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని పూడ్చారు. కాగా ప్రయాణికులు, వాహనదారులు అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ మార్గంలో చిన్నపాటి గోతులను పూడ్చి, పెద్ద గోతులను వదిలి పెట్టడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిన్నవి సరే.. పెద్దవి పూడ్చేదెప్పుడు?
అడ్డాపుశీల వద్ద రహదారి ఇలా...

చిన్న చిన్నవి మినహా భారీ గోతులను పట్టించుకోని అధికారులు

ప్రధాన కల్వర్టుల పనులు చేపట్టని వైనం

పెదవి విరుస్తున్న వాహనదారులు

గరుగుబిల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దారుణంగా తయారైంది. అడుగడుగునా భారీ గోతులు ఏర్పడడంతో పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని పూడ్చారు. కాగా ప్రయాణికులు, వాహనదారులు అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ మార్గంలో చిన్నపాటి గోతులను పూడ్చి, పెద్ద గోతులను వదిలి పెట్టడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. ప్యాచ్‌ వర్కులకే పరిమితం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ మార్గంలో ప్రఽధాన కల్వర్టుల పనులను కూడా చేపట్టకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

రోడ్ల పనులకు ప్రతిపాదనలు ఇలా..

పార్వతీపురం-పాలకొండ మార్గంలో ప్రధానంగా సంతోషపురం ప్రాంతంలో రహదారికి రూ.5 లక్షలు, రావివలస నుంచి వీరఘట్టం మండలం నడిమికెల్ల వరకు రూ.20 లక్షలు, ఎర్రన్నగుడి సముదాయం నుంచి పార్వతీపురం ఓవర్‌ బ్రిడ్జి వరకు పనుల కోసం రూ. 20 లక్షల మేర ప్రతిపాదనలు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జనవరి నాటికి ఆయా పనులు పూర్తి కానున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు చెబుతున్నారు.

ప్రధాన కల్వర్టులు ఇలా..

ఉల్లిభద్ర సమీపంలోని నాగావళి నది తోటపల్లి కుడి ప్రధాన కాలువపై నిర్మించిన స్లాబ్‌ కల్వర్టు కుంగుతున్న పరిస్థితి. పైకి ఇనుప చువ్వలు కూడా దర్శనమిస్తున్నాయి. కోటవానివలస, ఉల్లిభద్ర, సుంకి, సంతోషపురం, రావివలస ప్రాంతాల్లోని కల్వర్టులు కూడా శిఽథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వాటి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏ మాత్రం కల్వర్టులు కుంగినా.. రాకపోకలు స్తంభించిపోయే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రధాన కల్వర్టులు, రహదారులు అధ్వానంగా మారాయి.

వారం రోజుల్లో టెండర్లు

ప్రధాన రహదారిలో ఏర్పడిన పెద్ద గోతులను పూడ్చేందుకు వారం రోజుల్లో టెండర్లు ప్రక్రియ నిర్వహించనున్నాం. మరమ్మతులకు అవసరమైన అంచనాలు రూపొందించాం. నిర్వహణకు నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిన్నపాటి గోతులను పూడ్చి వేశాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన కల్వర్టుల వద్ద బయటకు వచ్చిన ఇనుప చువ్వల ప్రాంతంలో ప్లాస్టింగ్‌ చేస్తాం.

-వి.రామ్మోహనరావు, జేఈ, ఆర్‌అండ్‌బీ, పార్వతీపురం

Updated Date - Nov 19 , 2024 | 11:38 PM