వాటర్ బెల్ మోగట్లే!
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:21 PM
నాడు-నేడు కింద పాఠశాలల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
- వేసవిలో విద్యార్థులకు అందని తాగునీరు
- చాలా పాఠశాలల్లో పని చేయని ఆర్వో ప్లాంట్లు
- కానరాని ప్రత్యామ్నాయ చర్యలు
బొబ్బిలి ఏప్రిల్ 5: నాడు-నేడు కింద పాఠశాలల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలా పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరు చేయలేదు. కొన్ని బడులకు అందించినా అవి మూలకు చేరాయి. దీంతో ఈ వేసవిలో విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో చాలా పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమం సక్రమంగా అమలు కావడం లేదు.
వేసవిలో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా వారితో మంచినీటిని తాగించాలని సమగ్ర శిక్షా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ పాఠశాలల్లో ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు వాటర్ బెల్ కొట్టి విద్యార్థులతో నీటిని తాగించాలని ఆదేశించారు. కానీ, చాలా పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేకపోవడంతో వాటర్ బెల్ మోగడం లేదు. దీంతో తాగునీరు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఎవరైనా బయట ప్రపంచానికి చెబితే ఖబడ్దార్ అన్నట్లుగా ఉన్నతాధికారులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో అయ్యవార్లు ఈ విషయమైన నోరువిప్పడానికి బెంబెలెత్తిపోతున్నారు. బొబ్బిలి మండలం, పట్టణంలో రెండో విడతలో నాడు-నేడు పనులు చేసిన 40 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు పూర్తి స్థాయిలో రాలేదు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న 13 పాఠశాలలకు చిన్న సైజు ఆర్వోప్లాంట్లు ఇచ్చారు. మిగిలిన పాఠశాలలకు వారంలోగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈలోగా ఆయా పాఠశాలల్లో తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానరావడం లేదు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేందుకు మరో 19 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంకా ఆర్వో వాటర్ ప్లాంట్లు వస్తాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల హైస్కూల్, తదితర పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. హెచ్‌ఎంలు, ఎంఈవోలు చొరవ తీసుకొని వాటి మరమ్మతుల కోసం నానా తంటాలు పడుతున్నారు. అంతవరకు మున్సిపల్ కొళాయిల నుంచి వచ్చిన తాగునీటిని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. మొదటి విడతగా నాడు-నేడు పథకంలో పనులు చేపట్టిన పాఠశాలలకు మాత్రమే ఆర్వో ప్లాంట్లు ఇచ్చారు. వాటిలో చాలావరకు మూలకు చేరాయి. టోల్ ఫ్రీ నెంబరుద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే మెకానిక్ వచ్చి బాగు చేస్తారని చెప్పినప్పటికీ వాటికి అనుకున్నంత స్పందన కనిపించడం లేదు.
పక్కాగా అమలు చేస్తున్నాం
బొబ్బిలి మండలం, పట్టణంలో మొత్తం 91 పాఠశాలలు ఉన్నాయి. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున జిల్లా కలెక్టరు, డీఈవో ఆదేశాల మేరకు పాఠశాలల్లో వాటర్‌బెల్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. విద్యార్థులతో మూడుసార్లు నీటిని తాగిస్తున్నాం. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాం. ఆర్వో ప్లాంట్లు మరమ్మతుకు గురైన వెంటనే బాగు చేయిస్తున్నాం. మంజూరు కాని పాఠశాలల్లో ప్రత్యామ్నాయంగా తాగునీటిని అందిస్తున్నాం. నాడు-నేడు రెండో విడతలో మంజూరైన వాటర్ ప్లాంట్లు ట్రాన్స్‌పోర్టులో ఉన్నట్లు సమాచారం వచ్చింది.
-గొట్టాపు వాసు, మండలవిద్యాశాఖాధికారి-2, బొబ్బిలి