Share News

కోనేరుపై కన్నేశారు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:36 PM

బొబ్బిలి పట్టణ నడిబొడ్డులో పురాతనమైన గుర్రపు కోనేరు (నారాయణ పుష్కరిణి)పై ఆక్రమణదారులు కన్నేశారు. అంచెలంచెలుగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఐదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. హిందూ ఉత్సవసమితి, డోలాయాత్ర మండపం కమిటీ ప్రతినిధులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినా దురాక్రమణ పర్వానికి అడ్డుకట్ట పడలేదు. దేవదాయశాఖ అధికారులూ నిర్లిప్తంగా ఉన్నారు.

కోనేరుపై కన్నేశారు
బొబ్బిలి పట్టణంలో ఆక్రమణకు గురైన గుర్రపు కోనేరు

కోనేరుపై కన్నేశారు

బొబ్బిలి గుర్రపు కోనేరు ఆక్రమణ

రూ.కోట్ల రూపాయల దేవుని సొత్తుకు రెక్కలు

పట్టించుకోని దేవదాయ శాఖ

సమగ్ర విచారణ జరపాలన్న బేబీనాయన

బొబ్బిలి పట్టణ నడిబొడ్డులో పురాతనమైన గుర్రపు కోనేరు (నారాయణ పుష్కరిణి)పై ఆక్రమణదారులు కన్నేశారు. అంచెలంచెలుగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఐదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. హిందూ ఉత్సవసమితి, డోలాయాత్ర మండపం కమిటీ ప్రతినిధులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినా దురాక్రమణ పర్వానికి అడ్డుకట్ట పడలేదు. దేవదాయశాఖ అధికారులూ నిర్లిప్తంగా ఉన్నారు.

బొబ్బిలి, జూన్‌ 8:

బొబ్బిలి పట్టణ ప్రజల ఇలవేల్పు అయిన వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలోని గుర్రపు కోనేరులో ప్రత్యేక రోజుల్లో తెప్పోత్సవం, ఇతర పూజా ప్రక్రియలు జరుగుతుంటాయి. చారిత్రాత్మకమైన ఈ చెరువు మధ్యలో మండపం, ఆ మండపంలో శ్రీలక్ష్మీనారాయణుడు, అమ్మవారు పూజలందుకుంటున్నారు. అయితే కొద్దిరోజుల కిందట దేవుళ్ల విగ్రహాలను గుర్తుకు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. అదే సమయంలో కోనేరు చుట్టూ గట్టును పెద్దఎత్తున యంత్రాలతో తవ్వేసి చదును చేసేశారు. మరో పక్క అక్రమంగా షెడ్లను నిర్మించేశారు. ఈ నెల 6న ధ్వంసమైన విగ్రహాలను తిరిగి కోనేరు మండపంలో తెచ్చి పడేశారు. ఈ వ్యవహారమంతా పరిశీలించిన స్థానికులు దేవుని భూములు కొట్టేసేందుకు ఎత్తుగడగా భావిస్తున్నారు. కాగా బొబ్బిలి పట్టణంలోని గుర్రపు కోనేరు సర్వే నెంబరు 189/2లో ఉంది. మొత్తం గ్రామకంఠంలో 96 ఎకరాలుంది. అందులో 19 సెంట్లలో మండపం నిర్మించారు. కోనేరును కబ్జా చేసేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా దేవదాయశాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా కోనేరు వద్ద జరుగుతున్న వ్యవహారాలపై అనుమానంతో ముందుగానే హిందూ ఉత్సవసమితి ప్రతినిధి పువ్వల శ్రీనివాసరావుతో కలిసి వేణుగోపాలస్వామి ఆలయ ఇన్‌చార్జి ఈఓ ఎం.ప్రసాదరావు గత నెల 20న స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కలెక్టర్‌, ఎస్‌పీ, దేవదాయశాఖ అధికారులకూ ఫిర్యాదులు పంపారు.

-- వందల ఏళ్ల క్రితం కృష్ణశిలతో తయారు చేసిన పవిత్రమైన విగ్రహాలను ఎవరు దొంగలించారు? ఎవరు ధ్వంసం చేశారు? మళ్లీ ఎవరు తెచ్చి పెట్టారు? అక్రమ తవ్వకాలు జరిపింది ఎవరు? యంత్రాలతో పనులు చేసేందుకు అవసరమైన విద్యుత్‌ను ఎవరు ఇస్తున్నారు? కోనేరుకు వచ్చే వర్షపు నీటి మదుములను ఎవరు పూడ్చారు? కోనేరులోని నీటిని ఎవరు ఖాళీ చేయించారు? ఇవన్నీ నిగ్గు తేల్చాలని హిందూ ఉత్సవసమితి ప్రతినిధి పువ్వల శ్రీనివాసరావు డిమాండ్‌ చేస్తున్నారు.

- ఆక్రమణల విషయం తెలుసుకొన్న తాజా ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కెకె రంగారావు (బేబీనాయన) శనివారం అక్కడికి చేరుకొని పరిశీలించి విస్తుపోయారు. పవిత్రమైన విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని చూసి చలించిపోయారు. కోనేరు చుట్టూ పెద్దఎత్తున ఆక్రమణలు జరుగుతుండడంపైనా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అక్కడే ఉన్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఈవో ప్రసాద్‌ను ప్రశ్నించారు. ఈ భూమిని ఎందుకు కాపాడడం లేదన్నారు. తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు మిన్నకున్నారని అడిగారు. తక్షణం సర్వే జరిపించి దేవుని సొత్తును కాపాడాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, రాజీలు, పంచాయితీలకు తావులేదని అన్నారు.

ఆ రోజు నానా హంగామా చేశారెందుకో

బేబీనాయన

గుర్రపు కోనేరు పరిశీలన అనంతరం బేబీనాయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వైసీపీ వాళ్లు గతంలో తమ పైకి ఉసిగొలిపితే దేవదాయ శాఖ అధికారులు ఎంతో హడావిడి చేశారని, వారంతా ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. గుర్రపు కోనేరుకు చెందిన సుమారు ఐదెకరాల విలువైన భూమిని తప్పుడు రికార్డులతో రిజిస్ర్టేషన్‌ చేయించుకుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమార్కులతో అధికారులు లాలూచీ అయిపోయారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 08 , 2024 | 11:36 PM