Share News

Government's Fault ఇది నాటి సర్కారు పాపం

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:44 PM

This is the Government's Fault of the Day నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేస్తామని.. గిరిజన విద్యను బలోపేతం చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఆచరణలో మాత్రం చతికిలపడింది.

Government's Fault   ఇది నాటి సర్కారు పాపం
గుడ్డిమీదగూడలో పునాది దశలో నిలిచిపోయిన పాఠశాల భవనం

పూర్తికాని నాడు-నేడు పనులు.. పునాది దశలోనే భవనాలు

గిరిజన విద్యార్థులకు అవస్థలు.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

సీతంపేట రూరల్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేస్తామని.. గిరిజన విద్యను బలోపేతం చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఆచరణలో మాత్రం చతికిలపడింది. అప్పట్లో ఈ పథకం కింద సకాలంలో నిధులు మంజూరు చేయలేదు. దీంతో సీతంపేట ఐటీడీఏ పరిధిలో చాలాచోట్ల ఆ పనులు పూర్తికాలేదు. దీంతో గిరిజన విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. చాలీచాలని ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీతంపేట ఏజెన్సీలో నాడు-నేడు కింద మొదటి విడతలో 38 పాఠశాలలను ఎంపిక చేశారు. సుమారు రూ.13 కోట్లతో అదనపు తరగతి గదులు, కిచెన్‌ షెడ్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీల నిర్మాణం చేపట్టారు. విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం వంటివి కల్పించారు.

- రెండో విడతలో 57 జీపీఎస్‌(టీడబ్ల్యూ), ఎంపీయూపీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం రూ.9కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అరకొరగానే నిధులు మంజూరు చేసింది. దీంతో సకాలంలో నిధులు మంజూరు కాక వివిధ పాఠశాలల భవన నిర్మాణాలు పునాది దశలోనే అర్ధాంతరంగా నిలిచిపోయాయి కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిలిచిపోయాయి. గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మూడో విడతలో మంజూరైన పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో ఎంతో విలువైన ఐరన్‌ తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోతోంది. కొన్ని గ్రామాల్లో అయితే నాడు-నేడు పాఠశాలల పునాదుల కోసం వినియోగించిన ఇనుప చువ్వల పై గ్రామస్థులు దుస్తులు ఆరేసుకుంటున్నారు.

- సీతంపేట ఐటీడీఏ పరిధిలోని బెన్నరాయి, పూతికవలస, చిన్నపల్లంకి, తాడిపాయి, సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జజ్జువ, గడిగుజ్జి, బుడ్డడుగూడ, దిగువ బుడగరాయి తదితర పాఠశాలలకు వసతి సమస్య వేధిస్తోంది. జీపీఎస్‌, ఆశ్రమ పాఠశాలలు, ఎంపీయూపీ పాఠశాలల్లోని చాలీచాలని తరగతి గదుల్లో గిరిజన విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల మరుగుదొడ్లుకు రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేదు. విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. తరగతి గదుల్లో బెంచీలు కూడా లేకపోవడంతో గిరిజన విద్యార్థులు నేల పైనే చదువులు కొనసాగించాల్సి వస్తోంది.

ప్రభుత్వం దృష్టి సారించాలి

గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పునాది దశలో నిలిచిపోయిన నాడు-నేడు పాఠశాలల భవన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. నిధులు కేటాయించి ఆయా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.’ అని గిరిజన సంఘం నాయకులు పాలక సాంబయ్య, లక్ష్మణరావు తదితరులు కోరుతున్నారు.

ఎంఈవో ఏమన్నారంటే..

‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. రెండో విడతలో చేపట్టిన పనులన్నీ సగంలో నిలిచిపోయాయి. బిల్లులు సకాలంలో మంజూరుకాకపోవడమే ఇందుకు కారణం.’ అని ఎంఈవో ఆనందరావు తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 11:44 PM