Share News

తుఫాన్‌ గండం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:32 PM

జిల్లాకు తుఫాన్‌ గండం పొంచి ఉందనే సమాచారంతో రైతుల గుండెల్లో గుబులు రేగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారింది.

 తుఫాన్‌ గండం
సాలూరు మండలం యరగడవలసలో పత్తిని ఎత్తుతున్న రైతులు

- జిల్లాలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

- పంటలను కాపాడుకునేందుకు రైతుల తాపత్రయం

సాలూరు రూరల్‌, అక్టోబరు 22: జిల్లాకు తుఫాన్‌ గండం పొంచి ఉందనే సమాచారంతో రైతుల గుండెల్లో గుబులు రేగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్‌ ఒడిశా రాష్ట్రం పూరీ, సాగర్‌ల మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునే పనిలో బిజీగా మారారు. పత్తి మొదటి విడత దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పటికే కొంత పత్తిని సేకరించారు. మిగతా పత్తి పొలాల్లో ఉంది. మొక్కజొన్న పరిస్థితి ఇదే విధంగా ఉంది. వరి పంటకు ఇంకా కంకులు వస్తున్న దశలో ఉండడంతో ఆ పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు తక్కువని రైతులు అంటున్నారు. తుఫాన్‌పై ఇప్పటికే కలెక్టర్‌ మండలస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.

జాగ్రత్తలు పాటించాలి..

తుఫాన్‌ నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని, పంట సంరక్షణకు చర్యలు చేపట్టాలని సాలూరు మండల వ్యవసాయాధికారి అనురాధ పండా మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తుఫాన్‌తో బుధ, గురు, శుక్ర వారాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. పత్తి పొలాల్లో ఉంటే సేకరించి జాగ్రత్త చేసుకోవాలన్నారు. మొక్కజొన్న గింజలు తడవకుండా భద్రపరచుకోవాలన్నారు. తుఫాన్‌తో వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు తక్కువని అన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:32 PM