Share News

‘వల’స బతుకులు

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:05 AM

ఎన్నేళ్లయినా.. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల బతుకులు మాత్రం మారడంలేదు.

‘వల’స బతుకులు

- నాటు పడవలతోనే చేపలవేట..

- ధరలు గిట్టుబాటు కాక ఇతర ప్రాంతాలకు..

- ఇంటికి క్షేమంగా వస్తారో రారో తెలియని పరిస్థితి

నేడు ప్రపంచ మత్స్యకార దినం

ఎన్నేళ్లయినా.. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల బతుకులు మాత్రం మారడంలేదు. సంద్రంలోకి వేటకెళ్తే క్షేమంగా తిరిగొస్తారో రారో తెలీని పరిస్థితి. కుటుంబ సభ్యులు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. నడి సంద్రంలో బోట్లు బోల్తా పడితే మృత్యువే గతి. ఇలా వారి జీవితాలు దినదినగండంగా గడుస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం వీరి కోసం ఎన్నెన్నో చేస్తామని హామీలు ఇచ్చింది. చేపల విక్రయానికి మార్కెట్‌ యార్డు, శీతల గోదాము నిర్మిస్తామని గొప్పలు చెప్పి అటకెక్కించింది. అలాగే జెట్టీ నిర్మిస్తామని చెప్పి విస్మరించింది. ఎన్నో కష్టాలు పడి వేట సాగించి తెచ్చిన చేపలకు కూడా సరైన ధరలేక పోవడంతో వారికి నష్టమే మిగులుతోంది.

భోగాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో 28 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. చింతపల్లి, తమ్మయ్యపాలెం, తిప్పలవలస, బర్రిపేట, కొత్తూరు, కోనాడ, నీలగెడ్డపేట, బర్రిపేట, కోత్తూరు, కోనాడ, బొడ్డుగురయ్యపేట, పులిగెడ్డ, ముక్కాం, చినకొండ్రాజుపాలెం, పెద కొండ్రాజు పాలెం, ఎర్రముసలయ్య పాలెం, చేపలకంచేరు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 20వేల మంది ఉన్నారు. ఇందులో వేటపై ఆదారపడిన కుటుంబాలు 5వేలు ఉన్నాయి. అలాగే సాంప్రదాయ పడవలు 419, మరపడవలు 722 ఉన్నాయి.

ఆగస్టులోనే వలస

ఈ ఏడాది కూడా మత్స్యకారులు ఆగస్టులోనే గుజరాత్‌, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు వలసపోయారు. గుజరాత్‌లో వీరావల్‌, కాండ్లా, పోరుబందర్‌తో పాటు కర్ణాటకలోని మంగుళూరుకు వెళ్తుంటారు. తిరిగి ఏప్రిల్‌ నెలలోనే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. 8 నెలల పాటు కన్నవారిని, ఉన్న ఊరిని విడిచి ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. తీరంలో చేపలు అనుకున్నంత లభ్యంకాక, కష్టానికి తగ్గ పలితంలేక, కనీస సౌకర్యాలులేక.. ఉపాధి కరువై పోవడంతో సుమారు 700 మంది ఆగస్టులోనే గుజరాత్‌, ఒడిశా, కర్ణాటక, విశాఖ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దళారులు గ్రామాలకు వచ్చి అడ్వాన్సులు ఇచ్చి మత్స్యకారులను తీసుకెళ్లిపోయారు. వలస వెళ్లిన వారిలో అధికశాతం యువకులే. అలా వెళ్లిన వారు సముద్రంలో గల్లంతై మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి. దీంతో వారి కుటుంబాలు దుర్భర జీవనం గడుపుతున్నాయి.

వలసలకు కారణాలివీ

జిల్లాలో 28 కి.మీ. సముద్ర తీరమున్నా గుజరాత్‌ రాష్ట్రానికి వలసపోవడానికి కారణం మత్స్యకారుల ఆర్థిక పరిస్ధితులే. ఇక్కడివారు సంప్రదాయ తెప్పలు, మోటారు బోట్లతో వేట సాగిస్తున్నారు. ఐదారుగురు జాలర్లు వేటకు వెళితే ఖర్చులు కూడా రాని పరిస్ధితి ఉంది. ఇల్లు కట్టాలన్నా, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా పెద్ద సమస్యగా మారింది. గుజరాత్‌లోని బోటు యజమానులతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుని మత్స్యకారులు వలసవెళ్తారు. ఒక్కో బోటులో 7 నుంచి 9 మంది వరకు ఉంటారు. ఇందులో డ్రైవర్‌ (గుజరాత్‌లో తండేలు అంటారు), అసిస్టెంట్‌ డ్రైవర్‌, కలాసీలు, వంట మనిషి (బండారి) ఉంటారు. సీనియర్‌ డ్రైవర్‌కు నెలకు 35 వేల రూపాయలు, అసిస్టెంట్‌ డ్రైవర్‌కు 20 వేల వరకు, కలాసీ, వంట మనిషికి 12వేల నుంచి 15 వేల వంతున చెల్లిస్తారు. వేట ఆశించిన స్థాయిలో సాగితేనే డబ్బులు ఇస్తారు. గుజరాత్‌లో వలస మత్స్యకారులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాతన పడుతున్నారు.

సరిహద్దు దాటితే అంతే..

గుజరాత్‌లో వీరావల్‌లోని అరేబియా సముద్రంలో చేపల వేటసాగిస్తే ఈ ప్రాంత మత్స్యకారులు పొరపాటున సరిహద్దు దాటితే పాక్‌ కోస్ట్‌గార్డులకు చిక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2018 సంవత్సరం నవంబరు నెలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు పాక్‌కు బందీలుగా చిక్కి ఏడాదిన్నర తర్వాత విముక్తులయ్యారు. అంతకు మునుపు కూడా ఇలాంటి ఘటనలు ఉన్నాయి.

ఇక్కడ సౌకర్యాల్లేక..

మత్స్యకార గ్రామాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చేపలు ఆరవేసుకోవడానికి ప్లాట్‌పారాలు, కమ్యూనిటీ భవనాలు లేవు. వలలు భద్రపర్చుకోవడానికి లేదు. ఫ్లాట్‌ఫాంలు నిర్మించాలని, కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, గ్రామాల నుంచి సముద్రానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, కొనాడలో జెట్టీ నిర్మించాలని, మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వేట నిషేధ సమయంలో రూ.20వేలు అందజేయాలంటున్నారు.

వలలు, పడవలు రాయితీపై అందించాలి

గత ప్రభుత్వం మత్స్యకారులను ఏవిధంగానూ ఆదుకోలేదు. ఈప్రభుత్వం అయినా మాపై కరుణ చూపాలని ఆశిస్తున్నాము. మత్స్యకారులకు అవసరమైన పడవలు, వలలు, ఇంజన్‌ వేట సామగ్రి రాయితీపై అందించాలి. అలాగే చేపలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలి.

- మైలపల్లిఎల్లయ్య, మత్స్యకారుడు

జెట్టీ నిర్మించి వలసలు ఆపాలి

ఇక్కడ సరైన సౌకర్యాల్లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి పోతున్నారు. జెట్టీ నిర్మించాలి. అలాగే సామూహిక భవనాలు నిర్మించాలి. అప్పుడే వలసలు ఆగుతాయి. మా బతుకులు బాగుపడుతాయి.

- ఉమ్మడి రామారావు, ముక్కాం

సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళాం

ఈ పారంతంలో కొంతవరకు వలసలు వెళ్తున్నారు. జెట్టీ నిర్మాణానికి చర్చలు చేపడుతాం. అలాగే వలలు, పడవలు, ఇంజన్లు, రాయితీపై అడుగుతున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాం.

- ఎన్‌.నిర్మలాకుమారి, మత్స్యశాఖ డీడీ

Updated Date - Nov 21 , 2024 | 12:05 AM