Share News

గంజాయి ఛాయలు లేకుండా చేస్తాం

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:50 PM

జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

గంజాయి ఛాయలు లేకుండా చేస్తాం
మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

- ఎస్పీ వకుల్‌ జిందాల్‌

రాజాం రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. దీని కోసం ప్రత్యక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. రాజాం టౌన్‌ సర్కిల్‌ కార్యాలయ వార్షిక తనిఖీ కోసం బుధవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా సరిహద్దుల్లో నిఘాను పెంచామన్నారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో గంజాయి వాసన లేకుండా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో గంజాయి విక్రయాలు, వినియోగం, రవాణా చేస్తున్న వారి సమాచారం సేకరించి కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. ‘సంకల్పం’ కార్యక్రమం ద్వారా గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు, విద్యార్థులకు వివరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. గంజాయి కేసుల్లో సూత్రధారులను అరెస్ట్‌ చేసి మూలాలను సమూలంగా గుర్తించి చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. సైబర్‌ నేరాల నియంత్రణలో ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్‌ నేరానికి గురైతే 1930కి లేదా సైబర్‌ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

రాష్ట్రీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు ప్రారంభించామన్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించామని ఎస్పీ చెప్పారు. కాషనరీ బోర్డులు, స్టాఫర్స్‌, లైటింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దత్తత గ్రామాలలో వారంలో ఒకరోజు సంబంధిత కానిస్టేబుల్‌ పర్యటించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతకుముందు రాజాం టౌన్‌ సర్కిల్‌ కార్యాలయ రికార్డులను, స్టేషన్‌ ప్రాంగణంలోని పట్టుబడి ఎండకు ఎండి, వానకు తడుస్తున్న వాహనాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీశారు. మెయిన్‌ రోడ్డులో పడగొట్టిన పొలీసు క్వార్టర్స్‌ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలాన్ని పొలీసు శాఖకు తిరిగి అప్పగించేందుకు వీలుగా ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. బధిరుల పాఠశాలను సందర్శించారు. ఎస్పీతో పాటు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, స్పెషల్‌ బ్రాంచి సి..ఐ. లీలారావు, సి.ఐ.లు, కె.ఎ.కుమార్‌, ఉపేంద్రరావు, ఎస్‌.ఐ. రవికిరణ్‌ ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:50 PM