Share News

ఆ నిధులు ఏమయ్యాయి?

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:27 PM

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విడుదల చేసిన నిధుల విషయంలో రాజాం నియోజక వర్గంలో గందరగోళం నెలకొంది.

ఆ నిధులు ఏమయ్యాయి?

-ఎన్నికలు ముగిసి రెండు నెలలు దాటినా బీఎల్వోలకు అందని బిల్లులు

- విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు

- రాలేదంటున్న అధికారులు

-ఆందోళనలో 284 మంది బీఎల్వోలు

(రాజాం రూరల్‌)

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విడుదల చేసిన నిధుల విషయంలో రాజాం నియోజక వర్గంలో గందరగోళం నెలకొంది. ఒక్కో బీఎల్వోకు రూ.8 వేలు చొప్పున బిల్లులు విడుదల చేశామని ఎన్నికల సంఘం చెబుతుంటే, అధికారులు మాత్రం నిధులు ఇంకా రాలేదని అంటున్నారు. దీంతో బూత్‌లెవెల్‌ అధికారుల్లో ఆందోళన నెలకొంది. రాజాం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 284 మంది బూత్‌ లెవెల్‌ అధికారులు సార్వత్రిక ఎన్నికల విధుల్లో పొల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బూత్‌కు రూ.8 వేలు వంతున నిధులు మంజూరు చేసినట్లు ఈసీ జీవో జారీ చేసింది. ఈ మేరకు పోలింగ్‌ సిబ్బందికి ఆహారం, తాగునీరు, టిఫిన్‌, టీ, కాఫీలు సరఫరా చేశారు. పోలింగ్‌ రోజున షామియానాలు, కుర్చీలు, విద్యుదీకరణ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇందుకు సంబంధించి ఒక్కో బీఎల్వోకు అధికారులు రూ.5వేలు ఇచ్చారు. అవి సరిపోకపోవడంతో ఒక్కో బీఎల్వో అదనంగా రూ.3వేలు చొప్పున ఖర్చు చేశారు. మొత్తం 284 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి ఒక్కో బీఎల్వోకు రూ.3వేలు వంతున రూ.8,52,000 బకాయిలు రావాల్సి ఉంది. ఎన్నికలు ముగిసి 75 రోజులు గడుస్తున్నా నేటికీ బకాయిలు చెల్లించకపోవడంపై బీఎల్వోలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బకాయిలు రాలేదా?, లేక అధికారులు స్వాహా చేశారా? అని చర్చించుకుంటున్నారు. జిల్లాలో విజయనగరం, గజపతినగరం, ఎస్‌.కోట, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల్లోని బీఎల్వోలకు రూ.8వేలు వంతున రెవెన్యూ అధికారులు అందజేశారు. కానీ, రాజాం, చీపురుపల్లి నియోజ కవర్గాల్లో మాత్రం పూర్తిస్థాయిలో అందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నేటికీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ మొత్తం తక్షణమే తమకు అందజేయాలని ఉన్నతాధికారులను బీఎల్వోలు డిమాండ్‌ చేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై రాజాం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జోసెఫ్‌, సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృష్ణంరాజు వివరణ కోరగా.. ఇంకా నిధులు విడుదల కాలేదని, విడుదలైన వెంటనే బీఎల్వోలకు చెల్లింపులు చేస్తామని తెలిపారు.

కలెక్టర్‌ను కలిసిన వీడియోగ్రాఫర్లు

తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని రాజాంకు చెందిన పదిమంది వీడియో, ఫొటోగ్రాఫర్లు కలెక్టర్‌ అంబేడ్కర్‌ను ఇటీవల కలిశారు. ఎన్నికలు జరిగి రెండు నెలలు గడచినా తమకు చెల్లింపులు చేయలేదని వారంతా కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన కలెక్టర్‌ త్వరితగతిన చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాజాంకు చెందిన వీడియోగ్రాఫర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:27 PM